తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సిపిఐ నేత నారాయణ. ఆస్కార్ విజేతలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా ఆర్ఆర్ఆర్ టీం సభ్యులకు తన అభినందనలు తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పోట్లగిత్తల్లా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారని కొనియాడారు.
ఇక పార్లమెంట్ సమావేశాలపై స్పందిస్తూ.. హోం మంత్రి ఆఫీస్ నుంచి పార్లమెంటు సభ్యులకు వార్నింగ్ ఇస్తున్నారని.. పార్లమెంట్ ఆవరణలో సభ్యులకు నిరసన తెలిపే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు ఎవరు కూడా ఎక్కడ ఉల్లంఘన చేయడం లేదని.. అసలు ఉల్లంఘన చేస్తున్నది మోడీ ప్రభుత్వమేనని అన్నారు. పార్థమెంటు సభ్యులకు ఇచ్చిన వార్నింగ్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే మళ్లీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో దొంగ ఓట్లు వేస్తున్నారని.. టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు కూడా ఓట్లు వేస్తున్నారని అన్నారు. టెన్త్ క్లాస్ వాళ్లకు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ల వేళ్ళని నరికివేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.