జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత .. తోపులాటలో స్పృహతప్పిన 20 మంది

-

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం వేలాదిగా క్రికెట్‌ అభిమానులు జింఖానా మైదానానికి తరలివచ్చారు. పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది.

అంచనాలకు మించి అభిమానులు టికెట్ల కోసం రావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. జింఖానా మైదానంలో తోపులాటలో 20 మంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు ఓ వ్యక్తికి రెండు టికెట్లు ఇచ్చారనే మిగతా అభిమానులు గొడవకు దిగారు. ఆ గొడవ ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జింఖానా మైదానం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ ఉన్న పోలీసులు పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

టికెట్ల విక్రయాల వద్ద సాంకేతిక లోపంతో ఆన్‌లైన్‌ పేమెంట్లు జరగడం లేదు. దీంతో నగదు తీసుకుని టికెట్లు విక్రయిస్తున్నారు. ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో హెచ్‌సీఏ తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాస్‌ల జారీ కూడా గందరగోళంగా మారడంతో హెచ్‌సీఏపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version