రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపెల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారుల వేధింపులు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కంచర్ల గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు గ్రామ శివారులోని అటవీ భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. పత్తి పంటను ధ్వంసం చేయకుండా ఉండడానికి అటవీ శాఖ అధికారులు రమేష్ ను డబ్బులు డిమాండ్ చేశారు.
అటవీ శాఖ అధికారులకు రమేష్ డబ్బులు ఇవ్వకపోవడంతో అటవీ శాఖ అధికారులు పత్తి పంటకు గడ్డి మందుతో ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ ధ్వంసమైన పత్తి పంటను చూసి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానిక రైతులు రమేష్ ను ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.