కాలేజీ ఫీజుకని చెప్పి తండ్రి వద్ద లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఎడ్యుకేషన్ లోన్ కింద మరో లక్షా పది వేలు తీసుకున్నాడు. ఈ డబ్బంతా షేర్ మార్కెట్‌లో పెట్టాడు. వచ్చిందో లాభమో నష్టమో తెలియదు కానీ డబ్బు విషయం తండ్రి అడగ్గానే గుటకలు మింగాడు. స్నేహితుడికి ఇచ్చానని చెప్పాడు. సరే అతడి వద్దకే వెళ్దామన్న తండ్రితో మిత్రుడి వద్దకు బయలుదేరాడు. మధ్యలో వాష్‌రూమ్ కోసమని ఆగాడు. అంతే అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుంది.
మెదక్‌కు చెందిన రాహుల్ హైదరాబాద్‌లో మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఫీజు కడతానని చెప్పి ఇంట్లో రూ.లక్ష తీసుకున్నాడు. ఎస్బీఐలో ఎడ్యుకేషన్ రుణం కింద రూ.1.10 లక్ష తీసుకున్నాడు. వాటితో ఫీజు కట్టకుండా స్నేహితుడు జయవర్ధన్‌కు ఇచ్చానని తండ్రికి చెప్పాడు. జయవర్ధన్ వద్దకు వెళ్దామంటూ తండ్రి గద్దించడంతో.. ఈ నెల 15న ద్విచక్ర వాహనంపై ఇద్దరూ పటాన్‌చెరు వెళ్లారు. అక్కడి బస్టాండులో మరుగుదొడ్డికని వెళ్లి తిరిగి రాలేదు.
బంధువుల ఇళ్ల వద్ద వెతికినా తండ్రికి కుమారుడి ఆచూకీ లభించలేదు. బ్యాంకును సంప్రదించగా ఫీజు డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టినట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.