పావలా లేదా అర్ధ రూపాయి వడ్డీకే రుణాలు ఇస్తామంటే వారిని నమ్మవద్దని, అలాంటి మెయిల్స్ వచ్చినా స్పందించకూడదని పోలీసులు అంటున్నారు.
టెక్నాలజీ ఎంతగా మారుతున్నా.. మోసగాళ్ల బారి నుంచి ఎప్పటికప్పుడు ప్రజలు తప్పించుకుంటున్నా… కొందరు దుండగులు మాత్రం వినూత్న పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కేటుగాళ్లను కనిపెట్టడం పోలీసులకే పెను సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే కాదు, దేశంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్న ఓ వినూత్నమైన మోసమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు.
దుండగులు ముందుగా చాలా తక్కువ వడ్డీకే రుణం ఇస్తామని చెబుతారు. ఇక్కడ తక్కువ వడ్డీ అంటే సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వసూలు చేసే వడ్డీ కన్నా చాలా తక్కువన్నమాట. అది పావలా లేదా అర్ధ రూపాయి మాత్రమే. అంత తక్కువకు రుణం ఇస్తామని చెబుతూ, తాము ఫలానా ఆర్థిక సంస్థ లేదా ప్రముఖ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ.. ఫోన్లు చేస్తారు. దీంతో ఆ ఆఫర్‌కు ఆకర్షితమయ్యే వారు తమ వివరాలను మొత్తం వారికి అందిస్తారు. అయితే రుణం పొందాలంటే కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజు లేదా ట్యాక్సు లేదా పలు ఇతర ఖర్చుల కింద చెల్లించాలని నమ్మబలుకుతారు. దీంతో ఆ మొత్తాన్ని బాధితులు కడతారు. అయితే ఆ సొమ్ము చేజిక్కించుకున్నాక.. మోసగాళ్లు బాధితులకు ఇక కనబడరు. అప్పటి వరకు చెక్కులు వస్తాయని, రుణం మంజూరైందని చెప్పే దుండగులు, తమ చేతిలోకి బాధితుల డబ్బు చేరగానే పత్తా లేకుండా పోతారు. వారికి ఫోన్ చేసినా.. ఆ ఫోన్లు పనిచేయవు. ప్రస్తుతం ఇదే తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవలే సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్‌లో ఉంటున్న ఒక ప్రైవేటు ఉద్యోగి నవీన్‌కు కొందరు పైన చెప్పినట్టుగానే కుచ్చు టోపీ పెట్టారు. రూ.10 లక్షలిస్తామని చెప్పి అతని నుంచి రూ.91వేలు వసూలు చేసి పరారయ్యారు. తాము బజాజ్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నామని, రూ.10 లక్షల వరకు రుణం ఇస్తామని, కేవలం పావలా వడ్డీ మాత్రమే అవుతుందని నవీన్‌కు చెప్పగా, అతను అది నిజమేనని నమ్మి వారు చెప్పినట్లుగా అతనికి చెందిన అన్ని వివరాలను, పత్రాలను అందించాడు. ఆ తరువాత పలు దఫాల్లో పలు ట్యాక్సులు, చార్జీల పేరు చెప్పి అతను 20 రోజుల వ్యవధిలో సదరు దుండగులకు ఏకంగా రూ.91 వేలు చెల్లించాడు. ఆ తరువాత నుంచి తాను ఫోన్ చేసినా అవతలి వారు స్పందించడం లేదని చెప్పి నవీన్ భోరుమన్నాడు. తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులను అతను ఆశ్రయించాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే నిజానికి మన దేశంలో ఏ బ్యాంకు అయినా, ఫైనాన్స్ సంస్థ అయినా సరే.. రుణాలు ఇచ్చేటప్పుడు విధించే వడ్డీ ఎక్కువగానే ఉంటుంది. అలాగే వారు మనకు రుణం ఇచ్చేందుకు ఎలాంటి డబ్బు తీసుకోరు. కాకపోతే రుణం మంజూరయ్యాక అందులో కొంత వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు. కొన్ని సంస్థలైతే ఆ ఫీజు కూడా తీసుకోరు. కానీ ఏ లోన్‌కైనా వడ్డీ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అది తెలుసుకోలేని కొందరు తమకు కొందరు పావలా వడ్డీకే రుణం ఇస్తామని చెబితే దాన్ని నమ్మి వారు చెప్పినట్లుగా వేలకు వేలు ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించి, చివరికి మోసపోతున్నారు. కనుక ఇలాంటి వారు చేసే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పావలా లేదా అర్ధ రూపాయి వడ్డీకే రుణాలు ఇస్తామంటే వారిని నమ్మవద్దని, అలాంటి మెయిల్స్ వచ్చినా స్పందించకూడదని పోలీసులు అంటున్నారు. అలాగే ప్రాసెసింగ్ రుసుం, ఇతర చార్జిల పేరుతో డబ్బులు జమ చేయాలని ఎవరైనా అడిగితే.. వెంటనే ఆ విషయంపై తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని తాము అరెస్టు చేస్తున్నామని, ఈ ముఠాలు ఢిల్లీ, నోయిడా కేంద్రాలుగా పనిచేస్తున్నాయని కూడా పోలీసులు చెబుతున్నారు. కనుక జాగ్రత్త.. మీకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ ఎవరైనా ఫోన్ చేసినా, పలు చార్జిలు చెల్లిస్తే రుణం ఇస్తామని చెప్పినా.. అస్సలు నమ్మకండి.. వారు ఏదైనా ప్రముఖ బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ పేరు చెప్పినా సరే.. అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకున్నాకే ముందుకు సాగండి. లేదంటే అనవసరంగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!