నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన రమేశ్‌బాబు కార్ మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో అతడి సోదరి రామేశ్వరితో కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలని నకిలీ నోట్ల ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. యూట్యూబ్‌లో చూసి ఫేక్ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేస్తూ 2022లో గోపాలపురం పోలీసులకు చిక్కారు.
రమేశ్ బాబు జైల్లో ఉండగా.. రామేశ్వరి బెయిల్‌పై బయటకు వచ్చింది. జైల్లో ఉన్న రమేశ్ బాబు.. హత్యకేసులో జైలుకు వచ్చిన హసన్ బిన్‌తో పరిచయం పెంచుకుని ఫేక్ నోట్ల ప్రింటింగ్ గురించి చర్చించాడు. ఇద్దరూ కలిసి జైల్లోనే ప్లాన్ వేసుకున్నారు. బయటకు రాగానే రమేశ్ బాబు తన కుటుంబాన్ని తాండూర్‌కు తరలించి.. రూ.500 ఫేక్ నోట్లు తయారు చేసి గుజరాత్‌కు వెళ్లి అక్కడ చలామణీ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.
తన సోదరుడు పోలీసులకు దొరికిపోవడంతో హసన్బిన్ గురించి తెలుసుకున్న రామేశ్వరి అతడిని సంప్రదించి చాంద్రాయణగుట్టలో ఫేక్ నోట్ల చలామణీ ప్రారంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హసన్బిన్తోపాటు రామేశ్వరని అరెస్టు చేసి రూ.27 లక్షల నకిలీ నోట్లు, ప్రింటర్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.