జీలకర్ర నీళ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే.. నీటిలో జీలకర్రలను వేసి ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇలా తాగేవాళ్లు అంతకు ముందు రోజు రాత్రి జీలకర్రలను నీటిలో నానబెట్టాలి.
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన జీలకర్ర నీళ్లను తాగితే శరీర జీవక్రియ మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరగడమే కాకుండా కడుపు ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
జీలకర్ర నీళ్లను చాలా రకాలుగా తాగొచ్చు..
ఇంతకుముందు చెప్పినట్టు రాత్రి నానబెట్టిన జీలకర్ర గింజలను తెల్లారి తాజా నీళ్లలో మరిగించి ఖాళీ కడుపుతో తాగాలి. ఇది మొదటి పద్ధతి.
రెండవ పద్ధతిలో.. జీలకర్ర నీళ్ళకు నిమ్మ రసాన్ని కలపాలి. నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
అల్లం, జీలకర్ర నీళ్లు:
జీలకర్ర నీళ్లలో నలగ్గొట్టిన చిన్న సైజు అల్లం ముక్కను బాగా మరిగించాలి. ఆ తర్వాత వడపోసి గోరువెచ్చని జీలకర్ర నీళ్లను సేవించాలి. అల్లం లోని పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయం చేస్తాయి.
దాల్చిన చెక్క, జీలకర్ర నీళ్లు:
జీలకర్ర గింజలు, చిన్న దాల్చిన చెక్క, సోంపు గింజలు.. ఈ మూడింటిని నీటిలో బాగా మరిగించి వడపోసి తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
అంతేకాదు.. పైన చెప్పినట్టుగా జీలకర్ర నీళ్లను తయారుచేసి దానిలో కొద్దిగా తేనె కలుపుకొని ఉదయం లేవగానే తాగితే బాగుంటుంది.