ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కనుమళ్ల వద్ద దారుణం జరిగింది. వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజను గుర్తుతెలియని వ్యక్తి లారీతో ఢీకొట్టి చంపాడు. ఈ ఘటనలో మూలగుంటపాడు గ్రామానికి చెందిన రవితేజ(32) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ ప్రమాదానికి పాతకక్షలే కారణమని భావిస్తున్నారు.
రవితేజ, అతడి మిత్రుడు ఉమ వేర్వేరు ద్విచక్ర వాహనాలపై రాత్రి 8.30 గంటల సమయంలో కనుమళ్లకు వస్తుండగా వెనుక నుంచి లారీతో అతడిని ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మిత్రుడు ఉమ దానిని వెంబడించి ఆపడానికి ప్రయత్నించాడు. అతనిపైకి కూడా లారీని పోనిచ్చేందుకు డ్రైవర్ ప్రయత్నించగా కొద్దిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.
సింగరాయకొండ మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు వివాదం ఉందని స్థానికులు తెలిపారు. హత్యకు అదే కారణం కావచ్చని భావిస్తున్నారు.