చాంచల్ చేసిన మ్యాజిక్ ట్రిక్ 100 ఏళ్ల పాతది. అప్పట్లో ప్రముఖ మెజిషియన్ హ్యారీ హౌడిని ఈ ట్రిక్ చేసేవాడు. కానీ అది అప్పట్లో వేరేగా ఉండేది.
ఇంద్రజాల ప్రదర్శనలు ఎప్పుడూ ప్రేక్షకులకు వినోదాన్ని, విస్మయాన్ని కలిగిస్తుంటాయి. మెజిషియన్ ఒక ట్రిక్ చూపించి ప్రేక్షకులు తేరుకోకముందే మరొక ట్రిక్ చేస్తుంటాడు. దీంతో ప్రేక్షకులకు అంతలోనే ఆశ్చర్యం.. అంతలోనే షాక్ కలుగుతాయి. అయితే ఏ ఇంద్రజాలికుడు అయినా సరే.. తన ప్రేక్షకులకు కొత్త కొత్త విద్యలను చూపించి వారి మెప్పు పొందాలనే అనుకుంటాడు. ఆ దిశగా ఇప్పటికే అనేక మంది మెజిషియన్లు సక్సెస్ అయ్యారు కూడా. అయితే తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ మెజిషియన్ మాత్రం ఒక కొత్త స్టంట్ ద్వారా తన అభిమానులకు వినోదం పంచాలనుకుని.. ఆ ట్రిక్ ఫెయిల్ కావడంతో కానరాని లోకాలకు తరలివెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…
కోల్‌కతాకు చెందిన ప్రముఖ మెజిషియన్ చాంచల్ లాహిరి (41) మొన్న ఆదివారం అక్కడి హౌరా బ్రిడ్జి సమీపంలోని హూగ్లీ నదిలో ఓ వినూత్నమైన ట్రిక్ చేసి చూపించాలనుకున్నాడు. అందుకు గాను అతన్ని అతని బృందం 6 తాళ్లు, 6 తాళాలతో కట్టేసి నదిలోకి తలకిందులుగా దింపింది. ఆ తాళ్లను, తాళాలను తీసి చాంచల్ బయటకు రావాలి. అదీ ట్రిక్.. కానీ ఆ ట్రిక్ ఫెయిల్ అయింది. దీంతో చాంచల్ కు తాళాలు తీయడం సాధ్యం కాలేదు. ఫలితంగా అతను నీట మునిగాడు. దీంతో అతను చనిపోయాడు.
అయితే నీటిలో మునిగిన చాంచల్ 15 నిమిషాల్లో బయటకు రావాలి. కానీ 1 గంట సేపైనా రాకపోవడంతో చుట్టూ ఉన్న అందరికీ అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు గజ ఈతగాళ్లను వెంటబెట్టుకు వచ్చారు. నది అంతా గాలించారు. ఈ క్రమంలో వారికి ఒక రోజు తరువాత.. అంటే.. నిన్న సోమవారం.. చాంచల్ మృతదేహం దొరికింది. అతని శవానికి ఆ రోజు అతని బృందం కట్టిన తాళ్లు, తాళాలు అలాగే ఉన్నాయి. అంటే అతను చేసిన ట్రిక్ ఫెయిలైందని పోలీసులు నిర్దారించారు.
అయితే చాంచల్ చేసిన మ్యాజిక్ ట్రిక్ 100 ఏళ్ల పాతది. అప్పట్లో ప్రముఖ మెజిషియన్ హ్యారీ హౌడిని ఈ ట్రిక్ చేసేవాడు. కానీ అది అప్పట్లో వేరేగా ఉండేది. మెజిషియన్ ను తలకిందులుగా వేలాడదీస్తారు. అతని కాళ్లు ఒక కప్పుకు లాక్ అయి ఉంటాయి. అనంతరం అతన్ని తలకిందులుగానే నీళ్లు నింపబడిన ఓ గాజు బాక్సులోకి పంపుతారు. అతని కాళ్లు లాక్ అయి ఉన్న పైకప్పుతో ఆ బాక్సు మూసుకుంటుంది. అనంతరం ఆ బాక్సుకు ఉన్న ద్వారాలకు తాళాలు వేసి బాక్సు చుట్టూ వస్త్రాన్ని కప్పుతారు. అయితే 10 నుంచి 15 నిమిషాల్లోగా ఆ బాక్సులో ఉన్న మెజిషియన్ లాక్ ఓపెన్ చేసి బయటకు రావాల్సి ఉంటుంది. అప్పట్లో హ్యారీ ఈ ట్రిక్‌ను బాగా ప్రదర్శించేవాడు.
కాగా అప్పట్లో హ్యారీ చేసిన ఈ ట్రిక్‌కు ఉపయోగించిన గాజు బాక్సును ‘ది వాటర్ టార్చర్ సెల్’ అని పిలిచేవారు. అయితే హ్యారీ ఈ ట్రిక్‌ను సమర్థవంతంగా చేసేవాడు కనుక తదనంతరం ఈ ట్రిక్‌కు ‘హౌడిని ట్రిక్’ అని పేరు వచ్చింది. కానీ ఈ ట్రిక్‌ను చాంచల్ సరిగ్గా చేయలేకపోయాడు. దీంతో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ట్రిక్ చేసేముందు చాంచల్ ఒక మాట అన్నాడు. ‘ట్రిక్ సరిగ్గా పనిచేసి విజయవంతమైతే నా అభిమానుల గుండెల్లో నిలిచిపోతా. ఫెయిలైతే అంతకు మించిన ట్రాజెడీ మరొకటి ఉండదు..’ అన్నాడు. ఈ క్రమంలో అతను తాళాలు, తాళ్లతో లాక్ చేసుకుని నీటిలో మునగడం.. ఆ ట్రిక్ ఫెయిలవడం.. అనంతరం చనిపోవడం.. ఒక రోజు తరువాత శవంగా తేలడం.. జరిగిపోయింది.. ఏం చేస్తాం.. ఒక్కోసారి.. ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే అంటారు.. చావు ఎప్పుడు.. ఎవరికి.. ఎలా రాసి పెట్టి ఉంటుందో.. ఎవరూ చెప్పలేరని.. అది చాంచల్ విషయంలోనూ అలాగే జరిగినట్లు మనకు అనిపిస్తుంది..!