చెన్నై నగరానికి చెందిన ఓ మహిళ రూ.76 పెట్టి బిర్యానీ ఆర్డర్ చేసింది. ఆర్డర్ రాకపోగా.. ఆ డబ్బులు తిరిగి పొందేందుకు ఆమె రూ.40వేల వరకు చెల్లించి మోసపోయింది.
నేటి ఆధునిక టెక్ యుగంలో అన్నీ మన వేళ్ల చివర్లోనే అందుబాటులో ఉంటున్నాయి. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో మనం ఏది కావాలంటే అది మనకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ అవుతోంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లకైతే లెక్కే లేదు. ఇంట్లో వండుకోవడం ఎందుకు దండగ.. అని భావించే కొందరు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లపైనే ఆధార పడుతున్నారు. వాటిల్లో లభించే రాయితీలను ఉపయోగించుకుని ఎంచక్కా రోజూ బయటి ఫుడ్‌నే తింటున్నారు. అయితే అంత వరకు బాగానే ఉన్నా.. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వేలకు వేల డబ్బు వదిలించుకోవాల్సి వస్తుంది. చెన్నై నగరానికి చెందిన ఓ మహిళకు కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళితే…
చెన్నై నగరంలోని సౌకార్‌పేటకు చెందిన ప్రియా అగర్వాల్ 2 రోజుల కిందట ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ చేసింది. బిర్యానీకి రూ.76 మాత్రమే అయింది. అయితే ఆమె చేసిన ఆర్డర్ కొంత సేపటికి క్యాన్సిల్ అయింది. దీంతో ఆ ఫుడ్ డెలివరీ సంస్థ కస్టమర్ కేర్‌కు ఆమె ఫోన్ చేయగా వారు రూ.76 తిరిగి ఇస్తామని, కాకపోతే రూ.5వేలు చెల్లించాలన్నారు. దాంతో ఫుడ్ ఆర్డర్‌కు చెల్లించిన రూ.76 కలిపి మొత్తం రూ.5076 అకౌంట్‌కు పంపుతామని వారు చెప్పారు. దీంతో ఆమె అలాగే రూ.5వేలు చెల్లించింది.
అయితే రూ.5వేలు చెల్లించినా డబ్బు రాలేదు. దీంతో ఆమె మళ్లీ కస్టమర్ కేర్‌ను సంప్రదించింది. అయితే ఆమె చెల్లించిన డబ్బు తమకు రాలేదని, మళ్లీ రూ.5వేలు కట్టాలని వారు ఆమెకు చెప్పారు. దీంతో కంగుతిన్న ఆమె తడవకు రూ.5వేల చొప్పున మొత్తం 8 సార్లు కలిపి రూ.40వేలను చెల్లించింది. అయినా డబ్బు వాపస్ రాకపోయేసరికి తాను మోసపోయానని ఆమె తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాబట్టి జాగ్రత్త.. ఇలా డబ్బులు పంపమని ఎవరైనా అడిగితే కచ్చితంగా అందులో మోసం ఉంటుందని గ్రహించండి.. లేదంటే పెద్ద ఎత్తున డబ్బు నష్టపోవాల్సి వస్తుంది..!