తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. పీసీసీ పదవులకు రాజీనామా చేశారు 12 మంది కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారగొండ వెంకటేష్, ఎర్రశేఖర్ సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. అయితే.. రాజీనామా లేఖలను ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు నేతలు పంపారు. ఈ సందర్శంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకున్నా పని చేస్తాం. పదవుల కోసం రాలే, కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చామన్నారు. మా పదవులను సీనియర్లకు ఇవ్వాలని ఆమె కోరారు. రేవంత్‌రెడ్డి వర్గం ఓ వైపు.. సీనియర్ కాంగ్రెస్ నేతలు మరోవైపు ఇలా రెండుగా తెలంగాణ కాంగ్రెస్ చీలిపోయింది.
ఇదిలా ఉంటే.. ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమ సమావేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం దాకా ఈ ప్రోగ్రాం చేరేలా చూడాలని కోరారు. హైదరాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశంలో రేవంత్ మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర జనవరి 26న కాశ్మీర్ లో ముగుస్తుందని తెలిపారు. ‘హాత్ సే హాత్ జోడో’ సమావేశాలు వేదికగా కేంద్ర, రాష్ట్ర సర్కార్ల వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఈనెల 20 నుంచి 24 వరకు జిల్లా స్థాయి ‘హాత్ సే హాత్ జోడో’ సమావేశాలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. సమావేశాలు నిర్వహించి నివేదికలు పంపాలని పార్టీ శ్రేణులను రేవంత్ కోరారు. ఇంటింటికి వెళ్లి ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారం చేయాలన్నారు. ధరణి సమస్యపై కూడా పోరాటం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించాలన్నారు.