మోదీ జీ.. ఆ వివాదం ప్రభుత్వాల మధ్య గొడవ కాదు : సంజయ్ రౌత్

-

మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీ నిర్లక్ష్యం వహిస్తున్నారని శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదం ప్రభుత్వాల మధ్య గొడవగా చూడొద్దని.. దీన్ని మానవత్వం కోసం జరుగుతున్న పోరాటంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం వ్యాసం రాశారు.

‘‘రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో మోదీ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. కానీ, మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది ఓ మంచి రాజకీయ నాయకుడి లక్షణం కాదు’’ అని రౌత్‌ వ్యాఖ్యానించారు. కనీసం హోంమంత్రి అమిత్‌ షానైనా ఈ సమస్య పరిష్కారానికి చొరచూపడం మంచిదైందన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తటస్థ వైఖరి తీసుకుంటుందా? అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. పార్లమెంటులోనే దీనికి పరిష్కారం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని రౌత్‌ అన్నారు. ఆయన బెళగావి ప్రాంతంలోని మరాఠా మాట్లాడే నేతలు, వివిధ ప్రజా సంఘాలతో చర్చలు జరిపి ఉంటే బాగుండేదని హితవు పలికారు. మహారాష్ట్రలోని ప్రాంతాలను తమవంటూ బహిరంగంగా బొమ్మై ప్రకటిస్తున్నారంటే అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే బలహీనత అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version