కర్రెగుట్టలపై భద్రతా బలగాల పట్టు

-

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు విజయవంతంగా ఉక్కు పట్టు సాధించాయి. గత తొమ్మిది రోజులుగా సాగిన ఈ విస్తృతమైన కూంబింగ్ ఆపరేషన్‌లో కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (CRPF) కీలక విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ నడుపుతున్న నేపథ్యంలో నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్‌ స్వయంగా చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. CRPF కమాండర్లు ఈ భారీ ఆపరేషన్‌లో జరిగిన ప్రతి మారుపరిణామాన్ని ఐబీ చీఫ్‌కి సమగ్రంగా వివరించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో మావోయిస్టుల దుర్గాలపై ముమ్మరంగా దాడులు జరిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టల ప్రాంతం భద్రతా దృష్ట్యా కీలకంగా మారింది.

ఈ ప్రాంతంలో భద్రతా బలగాల ఉనికిని శాశ్వతంగా కొనసాగించేందుకు CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ బేస్ క్యాంప్‌ ద్వారా రెండు రాష్ట్రాల భద్రతా విభాగాలకు సమర్థవంతమైన సహకారం అందేలా చూస్తారు. త్వరలోనే ఇది అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే మావోయిస్టులు ఉపయోగిస్తున్న డంపులు, గుప్త సొరంగాలను భద్రతా బలగాలు గుర్తించి నిర్మూలించాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన మొదటి దశ ఆపరేషన్‌లో పాల్గొన్న బలగాలను అధికారులు వెనక్కి పిలిపించారు. ఇప్పుడు మరో కొత్త టీమ్ రంగంలోకి దిగి మరింత దూకుడుగా మావోయిస్టుల ఉనికిని కూకటి పారేస్తోంది. కర్రెగుట్టలపై నూతనంగా ఏర్పాటు కానున్న బేస్ క్యాంప్‌తో భద్రతా బలగాలు మరింత చురుకుగా, సమర్థవంతంగా కార్యకలాపాలు చేపట్టనున్నాయి. ఈ ఉక్కు సంకల్పానికి ఇది మరో కీలక మలుపు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news