పదవ తరగతి పరీక్షల ఫలితాలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో విడుదల చేసిన అనంతరం, అక్కడే నిర్వహించిన మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విప్లవకారుడన్నదే తుపాకీ పట్టేవాడే కాదు, సమాజంలో మార్పుని తీసుకురావాలనే దృక్పథం ఉన్నవాడే నిజమైన విప్లవకారుడు అని అన్నారు. రాహుల్ గాంధీపై బసవేశ్వరుని ప్రభావం ఎంతో ఉన్నదని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిందని, అదే విధంగా ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణ ఉండేందుకు ప్రతిపక్ష వ్యవస్థ అవసరమని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం సహా మంత్రులంతా పాల్గొంటున్నామని, అదే సమయంలో ప్రతిపక్షం నుంచి సహకారం అవసరమని తెలిపారు.
కానీ ఒక ప్రతిపక్ష నేత వరంగల్‌లో సభ పెట్టినా, ప్రజల సమస్యలపై ఎటువంటి చర్చ జరగలేదని, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కంటే విమర్శలకే పరిమితమయ్యారని సీఎం వ్యాఖ్యానించారు. “జీతాలు, వసతులు తీసుకుంటూ అసెంబ్లీలో పాల్గొనకుండా ఎలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు?” అని ప్రశ్నించారు. “అసెంబ్లీలోకి రాను, పిల్లలను పంపిస్తాను అంటారా? అలా అయితే ప్రతిపక్ష హోదా ఎందుకు?” అని విరుచుకుపడ్డారు.
ఫార్మ్ హౌస్ లో ఉండి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నించిన సీఎం, “మీరు అసెంబ్లీలో లేకపోతే మేము చేస్తున్నది ప్రజలకు ఎలా తెలుస్తుంది?” అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే, విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా సమాజంలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
“పదేళ్లు మేమే అధికారంలో ఉంటాం… అదే పదేళ్లు మీరు ఫార్మ్ హౌస్ లోనే ఉండిపోతారు. మీ చరిత్ర కూడా అక్కడే ముగుస్తుంది,” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. “మీ కుటుంబం గత పదేళ్లు దోచుకోలేదా? దేనిపై అయినా చర్చ చేద్దాం. మీరు చెప్పండి, సభ పెడతాం. కానీ విషంతో నిండిన మాటలు మానండి” అని హెచ్చరించారు.