జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వేడి పెరుగుతోంది. షర్మిల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు విజయవాడ ఏపీసీసీ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి యత్నించారు. దీంతో విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. షర్మిల ప్రస్తుతం ఏపీసీసీ కార్యాలయంలో బైఠాయించి ధర్నా చేస్తున్నారు అనే సమాచారం అందిన వెంటనే బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. వారు “షర్మిల క్షమాపణ చెప్పాలి” అంటూ నినాదాలు చేయగా, కాంగ్రెస్ నేతలు కూడా ప్రతినినాదాలతో స్పందించారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది.
ఆక్రోశంతో ఉన్న కొందరు బీజేపీ కార్యకర్తలు ఏపీసీసీ కార్యాలయం పై కోడి గుడ్లతో దాడికి తెగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాన్ని గమనించిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని, బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. తక్షణమే ఘటనాస్థలిలోకి ప్రవేశించబోయిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు, షర్మిల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ అభిమానులు తీవ్రంగా స్పందించారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పూలమ్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గామ్ ఘటనకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్‌ను కూడా ఆయన తప్పుబట్టారు. దేశ నిఘా వ్యవస్థలను మోదీ కోసం పనిచేస్తున్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.