జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్‌లో కలకలం రేగింది. ఈ లాంగ్‌మార్చ్ అనంతరం జీవీఎంసీ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. సభావేదికకు విద్యుత్ సరఫరా కావడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సభలో అప్రమత్తమైన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాయపడిన జనసేన కార్యకర్తలను హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. జనసేన ఇసుక కొరతపై విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించింది. జీవీఎంసీ గ్రౌండ్‌కు ర్యాలీ చేరుకున్న అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు.
సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేదిక మీద ఉండగానే ఈ సంఘటన జరిగింది. సభకు విద్యుత్ సరఫరా కోసం భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు నిర్వహాకులు. అయితే సభావేదికపై పవన్ కళ్యాణ్, ఇతర నేతలు కూర్చుని ఉండగా, అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో సభావేధికకు ఏర్పాటు చేసిన భారీకేడ్లకు షార్ట్ సర్యూట్ తో విద్యుత్ సరఫరా కావడంతో వేధికను పట్టుకుని నిలుచున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే విద్యుత్ సరఫరా కావడంతో అక్కడ ఏమీ జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
కరెంట్ షాక్ కొడుతుంది, వెంటనే జనరేటర్ ఆపేయండి అని అయ్యన్నపాత్రుడు మైక్‌లో అరవడంతో వెంటనే జనరేటర్‌ను నిలిపివేశారు. దీంతో సభా వేదికకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు అంబులెన్స్‌లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాసేపు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సభకు తీవ్ర అంతరాయం కలిగింది. తరువాత షార్ట్‌సర్యూట్‌కు కాకుండా మరమ్మత్తులు చేసి తిరిగి విద్యుత్‌ను పునరుద్దరించి సభను యధావిధిగానే నిర్వహించారు.