జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, అధిష్టానం ఆదేశిస్తే జూబ్లీహిల్స్ నుండి పోటీ చేస్తానని తెలిపారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.

మరోవైపు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నానని, జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి గెలిచాక తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు అంజన్ కుమార్ యాదవ్. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు.
పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిపై సర్వే జరుగుతోందని వెల్లడించారు. అభ్యర్థులు ఎవరున్నా అందరూ కలిసి పని చేస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.