డార్క్ చాక్లెట్స్ తింటే ఏం కాదు, ఇవి ఆరోగ్యానికి మంచివి, వీటి వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మెగ్రేన్ ఉన్నవాళ్లు రోజూ ఒక బైట్ తినొచ్చు, ఇది డిప్రషన్ నుంచి కూడా బయటపడేస్తుంది.. ఇన్నాళ్లు ఇలాంటివే కదా డార్క్ చాక్లెట్స్ గురించి విన్నారు. కానీ ఇప్పుడు మీకో షాకింగ్ న్యూస్..! తాజా నివేదిక కన్జ్యూమర్ రిపోర్ట్ ప్రకారం.. డార్క్ చాక్లెట్‌లో సీసం, కాడ్మియం అనే రెండు లోహాలు ఉన్నట్టు తేలింది. ఇవి పిల్లలు, పెద్దల్లో అనేక ఆరోగ్య సమస్యలను తెస్తుందట.
శాస్త్రవేత్తలు 28 డార్క్ చాక్లెట్ బార్లని పరీక్షించారు. ప్రతి దానిలో కాడ్మియం, సీసం ఉన్నట్లు కనుగొన్నారు. అన్నీ రకాల బ్రాండ్‌లలో ఈ భారీ లోహాలు ఉన్నాయి. అయితే కొన్నింటిలో మాత్రం వీటి పరిమితి కాస్త మెరుగ్గా ఉన్నట్టు తెలిపారు.
సీసం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్
హెర్షేస్, థియో, ట్రేడర్ జోస్ వంటి ఇతర బ్రాండ్‌లు తమ డార్క్ చాక్లెట్ ఉత్పత్తులలో సీసం, కాడ్మియం లేదా రెండింటికి సంబంధించిన స్థాయిలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. తరచుగా సీసం తీసుకోవడం వల్ల పెద్దవారిలో నాడీ వ్యవస్థ సమస్యలు, రక్తపోటు, రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం, మూత్రపిండాలు దెబ్బతినడం, పునరుత్పత్తి సమస్యలు ఏర్పడతాయి. ఇవి పిల్లలు, గర్భిణీలకి చాలా ప్రమాదరకమైనవి. ఇవి వాటిలో సమస్యల్ని మరింత ఎక్కువగా పెంచుతాయి.
కాడ్మియం వల్ల సైడ్ ఎఫెక్ట్స్
కాడ్మియం ఎక్కువగా తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది ఊపిరితిత్తుల సమస్యలకి దారి తీస్తుంది. కిడ్నీలకు కానీ కలిగిస్తుంది. ఇది పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కూడా కాడ్మియంని క్యాన్సర్ కారకంగా కనుగొంది. డార్క్ చాక్లెట్‌లో ఈ లోహాలు ఉండటం ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ రెండు భారీ లోహాలు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయట.
సీసం, కాడ్మియం నేలలో లభించే లోహాలు. ఇవి కాకో మొక్కల మూలాల నుంచి వస్తాయి. అన్నీ నేలలు, రాళ్ళలో కొంత కాడ్మియం ఉంటుంది. మైనింగ్, ఎరువులు, ఇతర పారిశ్రామిక అవసరాల ద్వారా అది విస్తృతంగా వ్యాపించింది. వాతావరణంలోకి విడుదలైన తర్వాత వర్షం ద్వారా మళ్ళీ భూమిలోకి చేరుతుంది.
వీటిల్లో కూడా కాడ్మియం ఉంటుంది..
కాడ్మియం చాక్లెట్ లో మాత్రమే కాదు ఇతర ఆహారాల్లో కూడా కనిపిస్తుంది. సీ ఫుడ్, సముద్రపు పాచి, జంతు అవయవాలు, బియ్యం, బంగాళాదుంపలు, ధాన్యాలు వంటి మరికొన్ని ఆహారాల్లోను కనిపిస్తుంది. ఇది చాలా సులభంగా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుందట.
ఎంత మోతాదు వరకూ మంచిది..?
డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మంచివే.. వాటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కానీ వీటిని కేవలం మితంగానే తినాలి. ఒక ఔన్స్ మాత్రమే తినాలని నివేదికలు చెబుతున్నాయి. అలా అని రోజూ ఒక ఔన్స్ తిన్నా డేంజరే. అప్పుడప్పుడు చాక్లెట్ తినడం ఉత్తమం. మొత్తం మీద ఔన్స్ తీసుకుంటే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇక దీన్ని తినాలా వద్దా అని మీరే డిసైడ్ అవ్వండి.