తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి శుక్రవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలీసు ఉద్యోగార్థుల వయో పరిమితిని 2 ఏళ్ల పాటు పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం… గ్రూప్ 1లో భాగంగా భర్తీ చేయనున్న డీఎస్పీ పోస్టుల అభ్యర్థుల ఎత్తును 165 సెంటీ మీటర్లకు తగ్గించింది. అయితే.. ఇప్పుడు తాజాగా పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు శుక్రవారంతో ముగియనున్న గడువును పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా ఉద్యోగాల భర్తీకి సంబంధించి శుక్రవారం ఒకే రోజు ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలను ప్రకటించడం విశేషం.
పోలీసు ఉద్యోగాల దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 26వరకు పొడిగించింది. ఈ నెల 26 ఉదయం 10 గంటల వరకు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.