ఆ జంతువు మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటా.. లైంగిక సామర్థ్యం, వీర్య పుష్టి పెరుగుతాయంటా.. శరీర దారుఢ్యం పెరిగి, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయంటా. ఇది గాడిద మాంసం తినడంపై ప్రజలకున్న అపోహలు. ఈ నమ్మకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిద మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత కొన్నేళ్లుగా ఆంధ్రపదేశ్‌లో విచ్చలవిడిగా గార్దభాల వధలు జరుగుతున్నాయి. సాధారణంగా గాడిదను చంపి తినటం నేరం.. అయినా ఈ విక్రయాలు జోరందుకుంటున్నాయంటే ఏ రేంజ్‌లో దీనికి డిమాండ్ ఉందో మనం ఊహించుకోవచ్చు.
ఇప్పటికే రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ చూసినా కనిపించే గాడిదలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. మాంసం కోసం, లైంగిక సామర్థ్యం పెరుగుతుందని.. గాడిదలను వధించటమే ఇందుకు కారణమని జంతు సంరక్షణ సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు. దీని వల్ల గాడిదల ఉనికి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ మాంసానికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. దీంతో కొంతమంది వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి అక్రమంగా గాడిదలను ఏపీకి తరలిస్తున్నారు.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వేల సంఖ్యలో ఉన్న గాడిదలు ప్రస్తుతం 5 వేలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గాడిదలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ గాడిదలను చూసేవాళ్లం. కానీ రాబోయే రోజుల్లో వాటిని కూడా జూలకు వెళ్లి చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని జంతు సంరక్షణ సంస్థ (ఎన్‌జీవో) కార్యదర్శి గోపాల్ ఆర్ సురబత్తుల ఆందోళన వ్యక్తం చేశారు. గాడిద పాలు, మాంసం వినియోగంపై ప్రజల్లో ఉన్న అపోహలు వీడాలని పశ్చిమ గోదావరి జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జీ నెహ్రూబాబు తెలిపారు. జంతు జాతిని కాపాడుకుందామని ఎన్‌జీవోలు ఉద్యమాలకు తెర లేపుతున్నాయి.