హైదరాబాద్ మహానగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో గల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మూసీ సుందరీకరణ, ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ పక్కా ప్లాన్‌తో ముందుకు దూసుకుపోతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిమీ పరిధిలో మొత్తం 40 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే మంగళవారం నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. ఇప్పటికే చాదర్‌ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసానగర్,రసూల్‌పుర,వినాయక్‌నగర్ పరిసరాల్లోని ఇళ్లకు రెవెన్యూ అధికారులు ఆర్బీ-ఎక్స్ మార్కింగ్ చేసి సీల్ వేశారు. అలాగే, మలక్‌పేట్ పరిధిలోని శంకర్‌నగర్ మూసీ రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్లను సైతం అధికారులు దగ్గరుండి కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు వెళ్లేందుకు దారి లేకపోవడంతో కూలీల సాయంతో కూల్చివేయిస్తున్నారు.నిర్వాసితులను ఇప్పటికే చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమాదాయానికి తరలించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.