దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన పెద్ద నోట్ల రద్దుకు ఐదేళ్లు పూర్తయింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేశారు. నేటికి పెద్దనోట్లు రద్దై 2021 నవంబర్ 8కి ఐదేళ్లు పూర్తయింది. ఆనాడు ప్రధాని మోదీ ప్రత్యేక ప్రసంగం ద్వారా పెద్ద నోట్లను రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకువచ్చారు. వీటి స్థానంలో కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను తీసుకువచ్చారు. పెద్దనోట్ల రద్దు వల్ల దేశంలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరారు. క్యూల్లో నిలబడి పలువురు మరణించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా నల్ల ధనాన్ని నిర్మూలించేందుకు, అవినీతిపై పోరాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారు. అయితే పెద్ద నోట్ల రద్దు అనుకున్నంత ఫలితంగా సాధించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. పెద్ద నోట్ల రద్దును ఓ విఫల ప్రయత్నంగా విపక్షాలు ఆరోపించాయి.