ప‌ని వేళ‌ల పెంపున‌కు ముసాయిదా!

-

రోజువారీ పనివేళలను 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌’ (ఓఎస్‌హెచ్‌ కోడ్‌) కింద ఈ నిబంధనలను సిద్ధం చేసింది. వీటిపై సంబంధిత భాగస్వామ్య పక్షాలు 45 రోజుల్లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుపవచ్చని పేర్కొంది. వాటిని పరిశీలించిన అనంతరం ఓఎస్‌హెచ్‌ కోడ్‌ అమలుకు నిబంధనలను ఖరారు చేయనుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రతిపాదనల ప్రకారం రోజులో పనివేళలను గరిష్ఠంగా 12 గంటల వరకు పెంచుకోవచ్చు.

అయితే ఇంతకుముందు ఉన్నమాదిరిగానే, వారంలో పనివేళలు గరిష్ఠంగా 48 గంటలు మించరాదు. అందుకనుగుణంగా, కార్మికుల పనిగంటలను ఒక రోజులో 12 గంటలకు (విశ్రాంతి వేళలను కలుపుకుని) మించకుండా సర్దుబాటు చేసుకోవాలని నిబంధనల్లో స్పష్టంచేశారు. పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన ఓఎస్‌హెచ్‌ కోడ్‌కు ఈ నిబంధనలు భిన్నంగా ఉండడం గమనార్హం. కోడ్‌లో రోజుకు గరిష్ఠ పనివేళలను ఎనిమిది గంటలుగా నిర్ణయించారు. 13 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఆ కోడ్‌ను రూపొందించారు. ఓఎస్‌హెచ్‌ కోడ్‌తోపాటు మిగిలిన మూడు కార్మిక కోడ్‌లకూ కేంద్రం ముసాయిదా నిబంధనలను రూపొందిస్తున్నది. జనవరి నాటికి వాటికి ఆమోదముద్ర వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version