జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకు కీలక సూచన చేశారు. శనివారం ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ట్వీట్ చేసిన ఆయన..‘ఓటు అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలన్నా, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను చట్ట సభలకు పంపించాలి.
అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు.18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, విధిగా ఓటింగ్లో పాల్గొనాలి’ అని పవన్ కళ్యాణ్ కోరారు. కాగా,భారతదేశంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుతున్న విషయం తెలిసిందే.