గుక్కెడు మంచినీళ్ల కోసం పడ్డ కష్టాలు ప్రజలు మరచిపోలేదు : మంత్రి మల్లారెడ్డి

-

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట గ్రామంలో బుధవారం నిర్వహించిన ఆశీర్వాద సభలో మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాల పాలనలో ప్రజలకు మేలు జరగలేదని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ముఖ్యమంత్రి చేసిన కృషి ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో గుక్కెడు మంచినీళ్ల కోసం పడ్డ కష్టాలు ప్రజలు మరచిపోలేదని అన్నారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని మూడోసారి కేసిఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన యువకులు, నాయకులు ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version