జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే రెవెన్యూ డివిజన్ చేస్తామని, ఈ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జనగామలో నిర్వహించిన విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జనగామ గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు. తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, ఆయనను 47 ఏళ్లు పార్టీ మోసిందని, కానీ చివరకు మోసం చేశారన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని, పల్లా రాజేశ్వర్ రెడ్డే చెప్పారన్నారు.
అంతే కాక, బోథ్ నియోజిక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ ని బలపరుస్తూ నిర్వహించిన ప్రజావిజయ భేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారిసభలో మాట్లాడుతూ తెలంగాణలో దొరల పాలన ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజాపాలన రావాలని తెలిపారు. సోనియమ్మ తుక్కుగూడలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు చూసి కేసీఆర్ అగం ఆగం అవతున్నడని, అందుకే ఫాం హౌజ్ లో పడుకున్న కేసీఆర్ ఓటమి పక్కా అని భయపడి రోజుకు ఒక ఊరిని పట్టుకొని తిరుగుతున్నారని తెలిపారు. లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేశాడని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానికి దక్కిందని తెలిపారు. ప్రజలు ఇక చరమగీతం పాడుతారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధి ఏమి అయిందని ప్రశ్నించారు.