సామూహిక జాతీయ గీతాలాపనలో పోలీస్‌శాఖ కీలకపాత్ర పోషించాలి : డీజీపీ మహేందర్‌ రెడ్డి

-

భారత దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సారి స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించ తలపెట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంలో పోలీస్‌శాఖ కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారని మహేందర్‌రెడ్డి అభినందించారు. ఆయా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని 16న నిర్వహించే జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుంచి అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అందరూ పాల్గొనేలా పోలీస్‌శాఖలోని అధికారులంతా కృషి చేయాలన్నారు మహేందర్‌రెడ్డి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, పోలీస్ కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర దేశాల్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని సూచించారు మహేందర్‌రెడ్డి.

ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో జిల్లాల పోలీస్‌ సూపరింటెండెంట్లు, పోలీస్‌ కమిషనర్లతో సమన్వయంతో పని చేయాలని సూచించారు మహేందర్‌రెడ్డి. ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి, 11.30గంటలకు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. అలారం మోగించేవిధంగా మైక్‌ సిస్టమ్స్‌ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు మహేందర్‌రెడ్డి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని, జాతీయ గీతాలాపన సమయంలో ఎలాంటి శబ్దాలు లేకుండా, క్రమశిక్షణతో ఆలపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు మహేందర్‌రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version