ప్రభుత్వ పథకాలను వద్దని చెప్పడం కూడా ఓ నిరసనే! కానీ మన దురదృష్టం పాలకులకు అదృష్టం. మన చేతగానితనం పాలకులకు వరం. మనం అడిగితే ఇస్తున్నారు అంటే మనం అడుక్కుంటే కరుణిస్తున్నారా? అంటే అవునన్నదే సమాధానం కావాలి. ఆంధ్రావనిలో సోమరుల శాతం అరవై రెండు.అంటే వీళ్లంతా వివిధ పథకాలపై ఆధారపడుతున్నారు అని! అంతా అని కాదు కొంత అని! వృద్ధులను వదిలేయండి, వికలాంగులను వదిలేయండి. ఇంకా కొన్ని వర్గాలను వదిలేయండి ఎలా లేదన్నా మా ఊళ్లో మా ఆంధ్రాలో సోమరులు నలభై శాతం మంది ఉన్నారనే అనుకుందాం.వీరికి బతకడానికి పని లేదు అని అనుకోకండి. ప్రభుత్వమే ఏ పనీ చేయనివ్వకుండా హాయిగా కూర్చోబెట్టి మేపుతోంది..అనేందుకు తార్కాణాలు ఎన్నో!
నిన్నటి బడ్జెట్ లో అభివృద్ధికి కన్నా సంక్షేమ రంగానికే ఎక్కువ నిధులు కేటాయించి ఉంటారు.ఉండాలి కూడా లేదంటే ఇబ్బందే!అలా కాదు ఆరు కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఓ రోడ్డు వేశారు. ఇన్నేళ్లకు మీరు చేసిన అభివృద్ధి ఇదొక్కటే అని అన్నామని అనుకోండి మనతో తగువుకు వస్తారు జగన్. ఎమ్మెల్యేలకు ఎట్టలకే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఇస్తే మంచిదే ! అది కూడా ఇంతకాలానికే అని మనం సర్దుకుపోవడం ఓ బాధ్యత.
ఇక సోమరులు అని ఎందుకు అన్నాను అంటే పాపం వీళ్లకు పని చేయాలని ఉన్నా ప్రభుత్వమే పనిచేయనివ్వదు. ఓ దారి చూపదు. ఓ ఉపాధి ఉండదు. అస్సలు సంపద సృష్టిపై దృష్టే ఉండదు. అంటే వీళ్లంతా హాయిగా తిని తొంగొంటారు అని అనడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు.
చంద్రబాబు కన్నా జగన్ జనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు అని అంటే చాలా మంది పాజిటివ్ గా అనుకుంటారు కాదు కాదు డబ్బులు పంచడంలో ఆ రోజు అవశేషాంధ్రను నడిపిన చంద్రబాబు కాస్త బెటర్.ఈయన అలా కాదు ఏటా ఏదో ఒకటి చేసి కొత్త పథకాల పేరిట జనాలకు డబ్బులు పంచి ప్రతిరోజూ పండుగే అన్న విధంగా ఉంచుతున్నారు.అలా ఉంచడంలోనే ఆనందం ఉంది అని అంటున్నారు.ఇదే జగన్ కు చెప్పిన పీకే (ప్రశాంత్ కిశోర్ అనే బీహారీ) నేర్పిన వ్యూహం. సాహో జగన్ ! ఓహో మరియు ఆహా కూడా!