డైలాగ్ ఆఫ్ ద డే : దేవుడిపైనే భారం వేశాం.. బొత్స మాట !

-

మంత్రి ప‌ద‌వి మ‌హా భాగ్యం కాదు అని అంటున్నారు బొత్స. 13 ఏళ్లుగా ప‌ని చేస్తున్నాను ఇదేం మ‌హా భాగ్యం కాదు అని వేదాంతం కూడా వినిపిస్తున్నారు. భాగ్యం కాదు క‌దా ! రాజీనామా చేయండి స‌ర్ అని అడిగితే ఈ విధంగా స్పందిస్తున్నారు. మంత్రి ప‌ద‌వి తృణ‌ప్రాయం అని భావిస్తే వ‌దిలేయ‌వ‌చ్చు క‌దా! ఎందుక‌ని ఇన్ని క‌ష్టాలూ, ఇన్ని అవ‌మానాలూ భ‌రించి స‌హించి ఉండాలి ? అన్న ప్ర‌శ్న కూడా విన‌వ‌స్తోంది. అయినా కూడా బొత్స ఇప్పుడు దేవుడ్ని న‌మ్ముకున్నారు.

దేవుడి సాయం కోరుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఐదు ప‌రీక్ష‌ల్లో జ‌రిగిన విధంగా ఇక‌పై జ‌ర‌గ‌కూడ‌ద‌ని మీడియా ముఖంగా వేడుకుంటున్నారు. అయినా కూడా ఆయా ప‌రీక్ష‌ల్లో కూడా మాస్ కాపీయింగ్ కానీ పేప‌ర్ లీకేజీ కానీ జ‌ర‌గ‌లేద‌ని కూడా అంటున్నారు. ఫ‌లితాల సాధ‌న‌పై తాము ఎన్న‌డూ ఉపాధ్యాయుల‌ను ఒత్తిడి చేయ‌నే చేయ‌లేద‌ని కూడా చెబుతూ అంద‌రినీ మ‌రోసారి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు గౌర‌వ మంత్రి.

మంత్రి బొత్స చాలా విభిన్న అయిన మ‌నిషి. మిగ‌తా మంత్ర‌ల క‌న్నా వాక్ చాతుర్యం ప్ర‌ద‌ర్శించాలి అన్న త‌ప‌న ఉన్న మ‌నిషి. దిగువ స్థాయి నుంచి ఎదిగివ‌చ్చిన మ‌నిషి. క‌నుక ఆయ‌న‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఇన్ని పరీక్ష‌లు పెడుతున్నాయి. వీటిని దాటుకుని రావ‌డం ఆయ‌న త‌రం కావ‌డం లేదు. ఎంత వ‌ద్ద‌నుకున్నా పేప‌ర్లు లీక్ అవుతున్నాయి. మాల్ ప్రాక్టీస్ జ‌రిగిపోతోంది. క‌న్ను మూసినా తెరిచినా ఇప్పుడివే వార్త‌లు డిజిట‌ల్ మీడియాల్లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఒంగోలులో జాతి ర‌త్నాలు పేరిట ఓ వాట్సాప్ గ్రూపు కూడా ప్ర‌శ్న ప‌త్రాల లీకుల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి.

ఇంత మంచి ప్ర‌భుత్వాన్ని మ‌నం తిట్ట‌కూడ‌దు అని అంటున్నారు బొత్స. మేం ఏమ‌యినా ఇటువంటివి ప్రోత్స‌హించామా బాధ్యుల‌ను అరెస్టు చేస్తున్నాం క‌దా అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు కూడా ! ఏదేమ‌యినా విద్యార్థి లోకం లో ఇటువంటి ప‌రిణామాల‌ను నిలువ‌రించ‌డం బాధ్య‌త గ‌ల బొత్స‌కు ఎందుక‌నో సాధ్యం కాని ప‌నిగా ఉంటోంది.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా ఎన్నో వివాదాలు న‌డిచాయి. ఆ విధంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అన్న‌ది విద్యా శాఖ‌కు త‌ల‌కు మించిన భారం అయింది.ఆ విధంగా చూసినా ఏ విధంగా చూసినా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా భారం అయింది. అందుకే ఆయ‌న దేవుడిపై భారం వేశారు. ఈ సారి ప‌రీక్ష‌లు ఎలా జ‌రిగినా కూడా ఫ‌లితాలలో మాత్రం నంబ‌ర్ ఒన్ అని అనిపించుకునేలా ఆంధ్రా ఉండాలన్న‌ది ఆయ‌న తాప‌త్ర‌యం కావొచ్చు.

సెటైరిక్ గా అనుకున్నా కూడా జ‌రిగేది ఇదే ! జ‌ర‌గ‌బోయేది కూడా ఇదే ! అందుకే ఆయ‌న ఈ రెండు రోజులు గ‌ట్టెక్కిపోతే చాలు అని వేయినొక్క దేవుళ్ల‌ను మొక్కుకుంటూ ఉన్నారు. మంచిదే ఓ రాష్ట్ర మంత్రి ఈ స్థాయిలో దేవుళ్ల‌కు వారి అనుచ‌రుల‌కూ ఇంకా చెప్పాలంటే దేవేరుల‌కూ వేడుకోవ‌డం మంచిదే ! అదే స‌మ‌యంలో ఆయ‌న పిల్ల‌ల్లాంటి వారే మిగ‌తా వారి పిల్ల‌లు కూడా అని భావించి స‌మ‌ర్థ రీతిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే ఎలాంటి త‌ల‌నొప్పులూ ఆయ‌న ద‌రి చేర‌వు గాక చేర‌వు.

Read more RELATED
Recommended to you

Exit mobile version