బిహేవియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్
దేన్ యాటిట్యూడ్
కావొచ్చు..!
అరవడం యాటిట్యూడ్
అరిచి సాధించడం బిహేవియర్
కావొచ్చు..!
ఎందుకురా ఈ ఏడుపులు అరుపులు !
విషాదం ఇచ్చిన కాలం ముందు ముందు కూడా అలానే ఉంటుంది. ఏ మార్పూ ఉండదు. మంచి చేయని వారికి చెడు మాత్రమే ఒక విధిగా భావించి చేసేవారికి కాలం అలానే ఉంటుంది. ఏ మార్పూ ఉండదు. తల్లిదండ్రులకు ఇప్పటి బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే అనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేం.వారికి స్మార్ట్ ఫోన్లు కొనివ్వడం.. టూ వీలర్లు కొనివ్వడం అన్నవి బాధ్యత అనుకునే మూర్ఖ శిఖామణులకు ఓ నమస్కారం.. తూర్పు తిరిగి ఓ దండం.
అంతకుమించి చేయాల్సింది వారి ప్రొగ్రస్ ను అబ్జర్వ్ చేయడం..బిహేవియర్ ను అబ్జర్వ్ చేయడం.. వాడి బడికి పోయి ఏం చేస్తున్నాడు అన్నది తెలుసుకోవడం.. వాడు కాలేజీకి వెళ్లకుండా ఏం చేస్తున్నాడో లేదా ఏం చేయాలని అనుకుంటున్నాడో ఆరా తీయడం.. ఇవేవీ చేయకుండా మాకు మా పిల్లలు ముద్దు అంటే మాత్రం అంతకుమించిన దౌర్భాగ్యం మరొక్కటి లేదు. మీ బిడ్డలు మీకే ముద్దు లోకానికి కాదు అని గుర్తు పెట్టుకోండి. అలా అని పేరెంటల్ వయొలెన్స్ ను చేయమనడం లేదు.. ఆ తరహా పెంపకాన్నీ పద్ధతినీ ప్రవర్తనా రీతినీ కూడా ప్రోత్సహించడం లేదు.అయినా సరే ! బిడ్డల పెంపకం అనే కళను మీరు నేర్చుకోలేకపోతున్నారే అన్నదే నిన్నటి తరం బాధ. ఒకప్పుడు చదువులు ఇలా ఉన్నాయా? పోనీ పెంపకం ! ?
కన్నీళ్లే మిగిల్చిన బిడ్డలు ఎందుకున్నారో ? ఎందరున్నారో ! హాయిగా ఆటపాటల మధ్య ఆనందంగా కాలం వెచ్చించే పిల్లలు ఎక్కడున్నారో ! ఏమో ! ప్రశ్నించుకుంటూ వెళ్లే సమయం ఇది. కానీ సమాధానాలు మన ఊహకు అందవు. ఊహకు అందనివి వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయి. ఘోరం వద్దు ప్రభూ! అని వేడుకుంటూ ఉన్నా కూడా అవే కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. పిల్లలంతా ! ఏవో చేస్తూ వెళ్తున్నారు. పెద్దతరం వారంతా వాటినే గుడ్లప్పగించి చూస్తున్నారు. కనుక మీరు మీ జీవితాల్లో మంచినీ మరియు మార్పునీ ఆశించకండి. మురికిని వదిలించుకోకుండా భరించండి ఏం కాదు. అది కూడా ఓ విధంగా కాలం ఇచ్చిన కానుకే అనుకోండి. చూడండి నిన్నటి వేళ గంజాయి అలవాటు పడ్డాడని తల్లి కొడుకును చితకబాదింది. కళ్లల్లో కారం కొట్టింది. అత్యంత అమానవీయ ధోరణిలో బాదుకుంటూ వెళ్లింది. గొడ్డును బాదిన విధంగా బాదింది. ఈ ఘటన కోదాడ (సూర్యాపేట జిల్లా, తెలంగాణ) లో జరిగింది. చేతులెలా వస్తాయి. కాళ్లెలా వణకకుండా మానేస్తాయ్. గుండె ఎందుకు లయ తప్పకుండా ఉంటుంది. అస్సలు ఆలోచనకు ఊహకు అందని పనులు ఆ పిల్లలు ఎందుకు చేస్తున్నారు ?