వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారా ?

-

భార‌త రాజ్యాంగాన్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అందులో ఆర్టిక‌ల్ 19 నుంచి 22 వ‌ర‌కు మ‌న‌కు భార‌తీయులుగా సంక్ర‌మించిన హ‌క్కుల‌ను పొందు ప‌రిచారు. దీని ప్రకారం మ‌న‌కు 6 హ‌క్కులు ముఖ్యంగా అందుబాటులో ఉన్నాయి. అవి ఆలోచన, భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశ స్వేచ్ఛ, సమాజ స్వేచ్ఛ, యూనియన్ ఏర్పాటు, ఉద్యమ స్వేచ్ఛ, నివాస స్వేచ్ఛ, వృత్తి స్వేచ్ఛ. కానీ 70 సంవత్సరాలలో మొదటిసారిగా కేంద్రం ధైర్యం చేసి నూత‌న‌ చట్టాలు చేయడం ద్వారా 60 కోట్ల మంది రైతులకు జీవనోపాధి స్వేచ్ఛను ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ దీన్ని కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు.

ప‌లు గ‌ణాంకాలు చెబుతున్న ప్ర‌కారం దేశంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. భారతదేశంలో సగటు రైతుల కుటుంబం ప్రతి నెలా రూ .8,931 మాత్రమే సంపాదిస్తుంది. అంటే, మొత్తం కుటుంబం రోజుకు గరిష్టంగా 300 రూపాయలు సంపాదిస్తుంద‌న్న‌మాట‌. మొత్తం కుటుంబం పనిచేస్తుంది, కానీ ఐదుగురు సభ్యుల లెక్క‌ ప్రకారం కనీస వేతనం 176 రూపాయలు కూడా ఉండ‌దు. భారతదేశంలో అయితే ఇత‌ర సాధార‌ణ‌ కుటుంబానికి నెలకు వచ్చే ఆదాయం 55 వేల రూపాయలు. భారతదేశంలో ఒక సాధారణ కుటుంబం రైతు కుటుంబం కంటే ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. కానీ అమెరికాలో ఒక సాధారణ కుటుంబం నెలకు 3.79 లక్షల రూపాయలు సంపాదిస్తే, రైతు కుటుంబం 4.35 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. అంటే అమెరికాలో రైతు కుటుంబం ఒక సాధారణ కుటుంబం కంటే 15 శాతం ఎక్కువ సంపాదిస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. కానీ మ‌న దేశంలో ఇందుకు భిన్నంగా ఉంది.

ఇక సూది తయారుచేసే కర్మాగారం అయినా, ఓడ తయారుచేసే సంస్థ అయినా ప్రతి ఒక్కరూ తమ వస్తువులను మార్కెట్లో ఏ రేటుకు విక్రయిస్తారో నిర్ణయిస్తారు, కానీ స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రైతు తన పంటకు మార్కెట్ ధరను నిర్ణయించే హక్కు పొందలేదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకు జీవించే హక్కును ఇస్తుంది, కానీ ఒక వ్యక్తి జీవనోపాధి లేకుండా అత‌నికి జీవించే హ‌క్కు ఎలా వ‌స్తుంది ? ఈ క్ర‌మంలో రైతు తన పొలంలో పండించిన ధాన్యంకు ధరను నిర్ణయించలేకపోతే అతని జీవనోపాధి హక్కు కూడా ఉండ‌దు. కానీ రైతుల‌కు 6 ద‌శాబ్దాల త‌రువాత నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల ద్వారా ఈ హ‌క్కు ల‌భించింది.

2020 సెప్టెంబర్ 17 న లోక్‌సభలో మూడు వ్యవసాయ బిల్లులు ఆమోదించబడ్డాయి. అదే రోజు ప్ర‌ధాని మోదీ.. రైతులను గందరగోళపరిచే శక్తులు ఉన్నాయ‌ని అన్నారు. ఆ మాట ప్ర‌స్తుతం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే రైతు చ‌ట్టాల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక 3 వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే…

మొదటి చట్టం

ఈ చట్టం ద్వారా రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్ల వెలుపల అధిక ధరలకు అమ్మగలుగుతారు. ప్రైవేట్ కొనుగోలుదారుల నుండి మంచి ధరలను పొందగలుగుతారు. కానీ ఈ చట్టం ద్వారా మండి వ్యవస్థను అంతం చేయాలని కేంద్ర‌ ప్రభుత్వం కోరుకుంటుందని రైతుల మనస్సుల్లో ఓ భయం నాటుకుపోయింది. ఇది వారిని ఆందోళ‌నల‌కు పురిగొల్పింది.

రెండవ చట్టం

ఈ చట్టానికి సంబంధించి రైతులు, ప్రైవేట్ సంస్థల మధ్య ఒప్పంద‌ వ్యవసాయానికి మార్గం సుగ‌మం అవుతుంద‌ని ప్రభుత్వం చెబుతోంది. దీనిని సాధారణంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. ఒక పెట్టుబడిదారుడు లేదా కాంట్రాక్టర్ రైతుల‌ భూమిని నిర్ణీత మొత్తానికి అద్దెకు తీసుకుంటారు. ఈ క్ర‌మంలో వారు సూచించిన మేర‌కు రైతులు పంట‌ల‌ను పండించి వారికి పంట‌ల‌ను విక్ర‌యించాలి. దీంతో పంట‌ల‌కు కావల్సిన ధ‌ర ఇచ్చి వారే కొంటారు. కానీ దీన్ని త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. దీని వ‌ల్ల కార్పొరేట‌ర్ శ‌క్తుల‌కు రైతులు బానిస‌లు అవుతార‌ని ప్ర‌చారం చేశారు. అలా ఏమీ ఉండ‌ద‌ని, రైతుల‌కే అధిక ప‌వ‌ర్స్ ఉంటాయ‌ని కేంద్రం చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.

మూడ‌వ చ‌ట్టం

రైతులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇది ప్రమాదకరమని దీని గురించి ఒక పుకారు వ్యాప్తి చెందుతోంది. ఈ చ‌ట్టం వ‌ల్ల రైతులు త‌మ ఉత్పత్తులను పెంచడానికి పరిమితి ఉండదు. ఇది బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్స‌హించేదిలా ఉంద‌ని కొంద‌రు ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అయితే దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని ప్రభుత్వం రైతులకు పదేపదే చెబుతోంది. అయినా దీనిపై పుకార్లు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి.

అయితే ఇంత‌కు ముందు రైతులు ఏం పెంచాలి, ఎంత‌కు అమ్మాలి అనే విష‌యాల‌ను ఇత‌రులు నిర్ణ‌యించేవారు కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని రైతుల‌కు ఆ చ‌ట్టాలు క‌ల్పించాయి. అయితే ఆశ్చ‌ర్యంగా ఆ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్నారు.

ఇక అమెరికన్ పాప్ సింగర్ రిహానా, పోర్న్ స్టార్ మియా ఖలీఫా, క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బ‌ర్గ్ అందరూ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్విట్టర్‌లో దూకి ఇంటర్నెట్‌ను ష‌ట్ డౌన్ చేయ‌డాన్ని నిరసిస్తున్నారు. బాగానే ఉంది. ఇంట‌ర్నెట్‌ను ష‌ట్ డౌన్ చేయ‌డం స‌రికాదు. దాని వ‌ల్ల రైతులు క‌మ్యూనికేట్ చేసుకోలేరు అనే విష‌యం క‌రెక్టే. కాక‌పోతే దాని వ‌ల్ల వారికే కాదు ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌ను వినే విద్యార్థుల‌కు, వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి ఇబ్బందులు క‌లుగుతాయి. క‌నుక ఇంట‌ర్నెట్ ష‌ట్ డౌన్ నిర్ణ‌యం స‌రికాదు. అయితే నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఏం చెబుతున్నాయి, వాటిల్లో ఏముంది అనే విష‌యాల‌ను తెలుసుకోకుండా విదేశీ సెల‌బ్రిటీలు అలా ట్వీట్లు చేయ‌డం స‌రికాదు. పూర్తి విష‌యం తెలుసుకున్నాకే ఎందులోనైనా త‌ల‌దూరిస్తే మంచిది. ఇప్ప‌టికైనా త‌ప్పుదోవ ప‌ట్టించ‌బ‌డిన రైతుల‌కు కేంద్రం అస‌లు విష‌యం చెప్పి ఆందోళ‌న‌ల‌ను విర‌మింప‌జేసేలా కృషి చేస్తే బాగుంటుంది. నూత‌న చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు మేలే జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని కేంద్రం రైతుల‌కు మ‌రింత గ‌ట్టిగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version