విజయసాయిరెడ్డి. వైసీపీ ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 67 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత లభించిన రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్.. వి.విజయసాయిరెడ్డి పేరును ప్రతిపాదించిన తర్వాతే రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన పరిచయమయ్యారు. దీనికి ముందు ఆడిటర్‌గా ఆయన పరిచయం ఉన్నప్పటికీ.. కొద్ది మందికి మాత్రమే ఆయన గురించి తెలుసు. తర్వాత తర్వాత ఆయన వైసీపీలోనే కీలక నాయకుడిగా ఎదిగారు. గత ఏడాది ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో సాయిరెడ్డి పాత్రను తక్కువ చేసి చూడలేమనేది వాస్తవం.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరీ ముఖ్యంగా విశాఖలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి పార్టీలో నంబర్ 2గా ఎదిగారు. ఎవరు ఏది కావాలన్నా.. ఎవరు ఏది చేయాలన్నా కూడా సాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగుతున్నాయనే రేంజ్‌కు ఎదిగారు. జగన్ కూడా ఆయనను అలాగే చేసుకున్నారు. ఏకంగా పార్టీ పార్లమెంటరీ నేతగా ఆయననే కొనసాగిస్తున్నారు. అనేక నిర్ణయాల్లో ఆయన దూకుడుగా ముందుకు సాగారు కూడా. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రేంజ్‌లో సాయిరెడ్డి ప్రాధాన్యం పెరిగింది. ఎవరైనా ఆయనను కలిసిన తర్వాతే సీఎంను కలుస్తారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా సాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టారని వైసీపీలోని కీలక నాయకులే చర్చించుకుంటున్నారు.
గతంలో జంట నేతలుగా కనిపించిన జగన్-సాయిరెడ్డిలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. అంతేకాదు.. జగన్ ఇప్పుడు తనకు దగ్గర బంధువు.. గతంలో సాక్షి పత్రికకు ఎడిటోరియల్ డైరెక్టర్‌గా పనిచేసిన సజ్జల రామకృష్ణా రెడ్డినే ఎక్కువగా నమ్ముతున్నారని, ఎక్కడ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా.. దీనికి సంబంధించి సజ్జలనే బాధ్యత తీసుకుంటున్నారని, అధికారులతో నిర్వహించే సమీక్షల్లోనూ గతంలో సాయిరెడ్డి కనిపిస్తే.. ఇప్పుడు సజ్జల ఆ స్థానంలోకి వచ్చారని అంటున్నారు. ఈ మొత్తం పరిణామం వెనుక ఏమై ఉంటుందనే విషయాన్ని మాత్రం వైసీపీ నాయకులు గుంభనంగా దాచేస్తుండడం గమనార్హం. మరి ఏమై ఉంటుందో.. సాయిరెడ్డి స్థానంలో సజ్జలకు ఎందుకు ప్రాధాన్యం పెరిగిందో తెలియాలంటే.. వెయిట్ చేయక తప్పుదు..!!