బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతిరేకంగా ప్రజా ఆస్తులను దెబ్బతీసేవారిని బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాదిరిగానే కాల్చి చంపాలని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన దిలీప్ ఘోష్, రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిరసనల సందర్భంగా రైల్వే ఆస్తులను,
ప్రజా రవాణాను నాశనం చేస్తున్న వారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ “కాల్పులు జరపలేదని, లాఠీ ఛార్జ్ చేయమని ఆదేశించారని” వ్యాఖ్యానించిన ఆయన “వారు నాశనం చేస్తున్న ప్రజా ఆస్తి ఎవరదని అనుకుంటున్నారు…? మీ తండ్రి ఆస్తా…? అని ప్రశ్నించారు. ఆ ఆస్తి పన్ను చెల్లింపుదారులకు చెంది౦ది అన్నారు. మీరు ఇక్కడకు వస్తారు, మా ఆహారాన్ని తింటారు,
ఇక్కడే ఉండి ప్రజా ఆస్తులను పాడు చేస్తారు. ఇది మీ జమీందారీనా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ” వాళ్ళు మమతా బెనర్జీ ఓటర్లు కావడంతో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వ్యక్తులపై దీదీ (మమతా బెనర్జీ) పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఉత్తర ప్రదేశ్, అస్సాం మరియు కర్ణాటకలోని మా ప్రభుత్వాలు ఈ వ్యక్తులను కుక్కల్లా కాల్చి చంపాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.