ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖను రాజధానిగా ప్రజలు ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ వ్యాఖ్యానించారు. అమరావతి పరిరక్షణ సమితి యాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పెనుగొండలో,
జోలెపట్టి విరాళాలు సేకరించి అనంతరం మాట్లాడుతూ అమరావతి నుంచి రాజధానిని తరలించాలంటే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ చేసారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతి రాజధానిని విశాఖకు మార్చుకోవాలని స్పష్టం చేసారు. అసలు విశాఖను రాజధానిగా ప్రజలు అంగీకరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు.
ఎన్నికలకు సీఎం జగన్ ఎలాగూ ఒప్పుకోరన్న చంద్రబాబు, అందుకే అమరావతి, విశాఖపై ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు దేన్ని కోరుకుంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక ప్రజలది ఒకదారి అయితే ముఖ్యమంత్రి జగన్ ది మరోదారి అంటూ చంద్రబాబు ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.