ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన నిధుల బదిలీపై ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే రెండు సార్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులిచ్చారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని, ఎటువంటి వ్యక్తులైనా తోడు ఉండరాదని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని, ఫార్ములా ఈ కార్ కేసులో అవినీతి ఏం జరగలేదని.. అందుకే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణ సందర్బంగా కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ..హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దొంగలు, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసే వారికి కోర్టులు సపోర్ట్ చేయవని కేటీఆర్ తెలుసుకోవడం మంచిదన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన ఆర్థిక నేరంపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.