తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కేంద్రమంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సవాల్ విసిరారు. సన్న బియ్యం పంపిణీకి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇస్తుందని తాను ప్రూవ్ చేస్తానని ప్రకటించారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వద్దని తాము అనలేదని.. కానీ,ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టరు? అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం అంత పెద్ద కార్యక్రమం జరిగింది. హుజూర్ నగర్‌లో ఉగాది సందర్భంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో.. తమకు కేంద్రం సహకరిస్తోందని ఎందుకు చెప్పలేకపోయారని ఆయన కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో పంచే బియ్యం కోటాలో కేంద్రం సహకారం తప్పక ఉందని బండి సంజయ్ వెల్లడించారు.