రైతు ఉద్యమంలో మరణించిన పంజాబ్ రైతులకు రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ నిర్ణయంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణలో రైతుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ పరిహారంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల చనిపోతుంటే.. పరిహారం ఇవ్వాలనే సోయి లేని ముఖ్యమంత్రి కేసీఆర్, పక్క రాష్ట్రాల్లో మరణించిన రైతులకు రూ. 3లక్షలు పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని డీకే అరుణ అన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టు ఉందని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఆత్మహత్యలకు పాల్పడ్డ నిరుద్యోగ యువతను గాలికొదిలేశారని డీకే అరుణ విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై డీకే అరుణ విమర్శలెక్కు పెట్టారు. దళితబంధు, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం నుంచి ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే.. రైతు ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు చట్టాలపై కేంద్రం మెడలు వంచుతా అని మాట్లాడుతున్న కేసీఆర్ తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. ఓట్లు, సీట్లు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు లేదని డీకే అరుణ ఆరోపణలు చేశారు.