భారత్‌లో కోవిడ్ రెండో వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు వారీగా నమోదవుతున్న కేసులు తగ్గుతున్నప్పటికీ సెకండ్ వేవ్ ఎప్పుడు పూర్తిగా అంతమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు రక రకాల ఫంగస్‌లు భయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌లో రకరకాల ఫేక్ వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై మరో ఫేక్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వ్యాక్సిన్ గురించి తప్పుడు సమాచారాన్ని అందులో వ్యాప్తి చేస్తున్నారు. కోవిడ్ టీకాలను తీసుకోవడం వల్ల స్త్రీలు, పురుషుల్లో సంతాన లోపం సమస్యలు వస్తాయని మెసేజ్‌లను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కరోనా వైరస్ వ్యాక్సిన్ పట్ల వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారంపై ఓ షార్ట్ వీడియోను విడుదల చేసింది.
కోవిడ్ టీకాలను తీసుకోవడం వల్ల స్త్రీలు లేదా పురుషుల్లో సంతాన లోపం సమస్యలు వస్తాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పీఐబీ వెల్లడించింది. కోవిడ్ టీకాలు పూర్తిగా సురక్షితమని, అవి ప్రభావవంతంగా పనిచేస్తాయని, వాటిని తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడించింది.
कई फर्जी खबरों/संदेशों के ज़रिए #कोविड टीकाकरण से जुड़े भ्रम फैलाए जा रहे हैं, इनमें से एक भ्रम यह है कि वैक्सीन महिलाओं व पुरुषों में संतानहीनता(infertility) का कारण हो सकती है!#PIBFactree
यह वैक्सीन पूरी तरह सुरक्षित है व इससे संतानहीनता होने का कोई वैज्ञानिक प्रमाण नहीं है। pic.twitter.com/gVMShYYBqJ
— PIB Fact Check (@PIBFactCheck) May 24, 2021
ఈ క్రమంలోనే కరోనా వైరస్, కోవిడ్ టీకాల గురించి వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని పీఐబీ కోరింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ల వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామని, కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటున్నామని తెలిపింది. ప్రతి ఒక్కరూ టీకాలను తీసుకోవాలని, టీకాలు తీసుకోవడంలో ఎలాంటి భయాలు, ఆందోళనలు, అపోహలకు గురి కావద్దని, ఏదైనా సమాచారం తెలుసుకోదలిస్తే వైద్యులను సంప్రదించాలి, కానీ సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది.