చిరంజీవిని వరించిన అవార్డులు.. నిజమైన మాస్‌ హీరో

-

మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే.. ఆయన కథ మొత్తం వివరించాల్సిన అవసరం లేదు. ఆయనకు వచ్చిన అవార్డులను ఒక్కసారి పరిశీలిస్తే చాలు.. ఆయనేంటనేది ఎవరికైనా తెలుస్తుంది.

ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే.. అతని జీవిత చరిత్ర మొత్తం చెప్పాల్సిన పనిలేదు. అతను ఏం చేశాడో, ఏం సాధించాడో.. అతనికి వచ్చిన అవార్డులు, రివార్డులే అతని ప్రతిభను మనకు తెలియజేస్తాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే.. ఆయన కథ మొత్తం వివరించాల్సిన అవసరం లేదు. ఆయనకు వచ్చిన అవార్డులను ఒక్కసారి పరిశీలిస్తే చాలు.. ఆయనేంటనేది ఎవరికైనా తెలుస్తుంది. అయితే చిరంజీవికి అవార్డుల కన్నా అభిమానులు ఇచ్చిన రివార్డులే ఎక్కువ. ఏ నటుడికైనా కావాల్సింది ప్రజల మెప్పు.. అలాంటి ప్రజాదరణ పొంది మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే…

సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు.

2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అలాగే 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. అలాగే తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. కాగా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. ఇలా చిరంజీవిని ఎన్నో అవార్డులు వరించాయి. అయినా ఆయన మనకు ఎప్పుడూ నిగర్విగా కనిపిస్తారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమంటే బహుశా ఇదేనేమో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version