కార్తీకస్నానం: ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం తెల్లవారు ఝామున చల్లనీటి స్నానం. దీనివెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శరత్‌రుతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. వర్ష రుతుప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తీకస్నానం. నదుల్లో, సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇది వీలుకాకపోతే ఇంట్లోనైనా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
స్నానం ఎలా ఆచరించాలి: చల్లటి నీటితో స్నానం చేయాలి. వృద్ధులు, ఆనారోగ్యంతో వున్నవారికి ఈ విషయంలో సడలింపు ఉంది. మొదట మామూలుగా స్నానం ఆచరించి, తర్వాత పొడి వస్త్రం ధరించి సంకల్పం చెప్పుకొని రెండోసారి స్నానం ఆచరించాలి. శ్లోకం రానివారు, చదవలేనివారు భగవన్నామ స్మరణతో స్నానమాచరించాలి.
చదవాల్సిన శ్లోకం: తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్యపావని
సర్వత్రా ద్రవరూపేణ సాసంసారే భవేత్ తథా
ఈ ఏడాది స్నానం చేయాల్సిన సమయం:
నవంబర్ 16 వరకు ఉదయం 6 గంటలలోపు
నవంబర్ 17 నుంచి 27 వరకు ఉదయం 5.30 లోపు
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ఉదయం 5 గంటల లోపు
డిసెంబర్ 4, 5,6, 7 తేదీల్లో ఉదయం 4.45 నిమిషాలలోపు చేయాలి.
కార్తీక స్నాన ఫలితం: శివకేశవుల అనుగ్రహం. మోక్షప్రాప్తి
ఈ సమయాల్లో చేయడానికి అవకాశం లేనివారు అంటే వృద్ధులు, ఆనారోగ్యంతో బాధపడుతున్నవారు కనీసం శుద్ధపాడ్యమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో పైన చెప్పిన సమయాల్లో స్నానం ఆచరిస్తే 30 రోజులు స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుంది.
ఉద్యోగ కారణాలతో అవకాశం లేనివారు- కనీసం కార్తీక మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు పైన ఆయారోజుల్లో చెప్పిన సమయాల్లో స్నానం ఆచరించి దేవాలయ సందర్శన చేసినా 30 రోజులు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.