మొదటి సారిగా 1954 జనవరి 2వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతరత్న అవార్డుకు శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు 46 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక వీరిలో ముగ్గురు విదేశీయులు కూడా ఉండడం విశేషం.
మన దేశంలో ఉన్న ఎవరైనా సరే.. ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేస్తే దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేస్తారని అందరికీ తెలిసిందే. మొదటి సారిగా 1954 జనవరి 2వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతరత్న అవార్డుకు శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు 45 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక వీరిలో ముగ్గురు విదేశీయులు కూడా ఉండడం విశేషం.
కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు తదితర రంగాల్లో అమోఘమైన కృషి చేసిన వారికి భారతరత్నను ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తొలిసారిగా భారతరత్నను ఎవరు స్వీకరించారో.. ఇప్పుడు, ఈ ఏడాది భారతరత్నను ఎవరికి ప్రదానం చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతరత్న పురస్కారం పొందిన వారు వీరే..!
- 1954వ సంవత్సరంలో ముగ్గురికి భారత రత్న ప్రదానం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, డాక్టర్ సీవీ రామన్‌లకు ఆ ఏడాది ఈ అవార్డును అందించారు.
- 1955వ సంవత్సరంలో డాక్టర్ భగవాన్ దాస్, డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రూలకు భారతరత్న లభించింది.
- 1957లో గోవింద్ వల్లభ్ పంత్‌కు, 1958లో ధొండొ కేశవ కార్వేకు, 1961లో డాక్టర్ బీసీ రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్‌లకు భారత రత్నను ప్రదానం చేశారు.
- 1962లో రాజేంద్ర ప్రసాద్‌కు, 1963లో డాక్టర్ జాకీర్ హుస్సేన్, పాండురంగ వామన్ కానేలకు భారతరత్న ఇచ్చారు.
- 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఆయనకు భారతరత్న ఇచ్చారు. ఇందిరాగాంధీకి 1971లో, వీవీ గిరికి 1975లో ఈ అవార్డును ప్రదానం చేశారు.
- 1976లో కె.కామరాజుకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు. 1980లో మదర్ థెరిసాకు ఈ అవార్డు ఇచ్చారు. ఇక 1982లో ఆచార్య వినోభాభావే మృతి చెందగా ఆయనకు 1983లో భారతరత్న ఇచ్చారు. అలాగే 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు ఈ అవార్డు లభించింది.
- ఎంజీ రామచంద్రన్ 1987లో కన్నుమూయగా ఈయనకు 1988లో భారతరత్న ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1956లో కన్నుమూయగా ఈయనకు 1990లో భారతరత్న ఇచ్చారు
- నెల్సన్ మండేలాకు 1990లో, రాజీవ్ గాంధీకి ఆయన మరణానంతరం 1991లో, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఆయన మరణానంతరం 1991లో, మొరార్జీ దేశాయ్‌కు 1991లో భారతరత్న ప్రదానం చేశారు.
- 1958లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణించగా ఆయనకు 1992లో భారతరత్న ఇచ్చారు. అలాగే జేఆర్‌డీ టాటా, సత్యజిత్ రే, సుభాష్ చంద్రబోస్‌లకు 1992లో భారతరత్న ఇచ్చారు. కాగా సుభాష్ చంద్రబోస్‌కు ఇచ్చిన భారతరత్న అవార్డును పలు కారణాల వల్ల ఉపసంహరించుకున్నారు.
- అరుణా అసఫ్ అలీ 1995లో మృతి చెందగా 1997లో భారతరత్న ఇచ్చారు. అలాగే అదే ఏడాది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, గుర్జారీలాల్ నందాలకు భారతరత్న లభించింది.
- 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మి, సి.సుబ్రహ్మణ్యం, జయప్రకాష్ నారాయణ్‌లకు భారతరత్న ఇచ్చారు. 1999లో రవిశంకర్, అమర్త్యసేన్, గోపీనాథ్ బొర్దొలాయిలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
- 2001లో లతా మంగేష్కర్, బిస్మిల్లాఖాన్‌లకు, 2008లో భీన్ సేన్ జోషికి, 2014లో సచిన్ టెండుల్కర్, సీఎన్ఆర్ రావులకు భారతరత్న లభించింది.
- 2015లో మదన్ మోహన్ మాలవ్యా, అటల్ బిహారీ వాజ్‌పేయికి భారతరత్న ఇచ్చారు
- ఈ ఏడాది భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్‌ముఖ్, భూపెన్ హజారికలకు భారతరత్నను ప్రదానం చేయనున్నారు.
కాగా భారతరత్న పురస్కారం పొందిన విదేశీయుల్లో మదర్ థెరిస్సా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలాలు ఉన్నారు.