హోంబలే ఫిల్మ్స్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

-

ఇటీవల కాలంలో అలా భారతీయ చలన చిత్ర పరిశ్రమంతా చర్చించుకునేలా చేసిన నిర్మాణ సంస్థల్లో ‘హోంబలే ఫిల్మ్స్‌’ ఒకటి. ‘కేజీయఫ్‌’తో సంచలనం సృష్టించిన ఈ సంస్థ ‘కాంతార’తో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న ‘హొంబలే’ ప్రయాణాన్ని ఓ సారి చూద్దాం..

హోంబలే అర్థమిదీ.. విజయ్‌ కిరంగదూర్‌, చలువే గౌడ, కార్తిక్‌ గౌడ.. ఈ ముగ్గురికి సినిమాపై ఉన్న ఆసక్తే ‘హోంబలే ఫిల్మ్స్‌’కు కారణం. వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు విజయ్‌ కిరంగదూర్‌ మాండ్య నుంచి బెంగళూరుకు షిఫ్ట్‌ అయిన రోజులవి. అదే సమయంలో కార్తిక్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. కానీ, ఈ కజిన్స్‌కు మాత్రం సినిమాపై ప్రేమ పోలేదు. ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలనుకుని, దాని కోసం ఎంతో ప్రయత్నించి 2013లో ‘హోంబలే ఫిల్మ్స్‌’ను ప్రారంభించారు. దీనికి కిరంగదూర్‌, చలువే గౌడ అధినేతలుకాగా కార్తిక్‌ గౌడ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహిస్తున్నారు. తమ ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు ‘హోంబలే ఫిల్మ్స్‌’ అని నామకరణం చేశారు.

ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’ (పాన్‌ ఇండియా)ను ప్రకటించిన ‘హోంబలే ఫిల్మ్స్‌’ జాబితాలో ‘టైసన్‌’ (మలయాళం), ‘భగీర’, ‘రిచర్డ్‌ ఆంథోనీ’, ‘ధూమం’ (మలయాళం) ఉన్నాయి. ఇటీవల ‘ఉత్తరకాండ’ చేరింది. ‘పుష్ప’లో జాలిరెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ధనుంజయ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇలా ఈ సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమాపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఓ వైపు భారీ బడ్జెట్‌ ప్రాజెక్టులు, మరోవైపు చిన్న చిత్రాలతోనూ సక్సెస్‌ అందుకోవటానికి కారణమిదే అంటుంటారు కార్తిక్‌.. ‘‘మేం ఏ కథనైనా ప్రేక్షకుల కోణంలోనే చర్చిస్తాం. ‘ఎలాంటి అంశాలు ఉంటే ఆడియన్స్‌కు నచ్చుతుంది. కొత్తగా ఏం చూపించాలి?’ అనే దృష్టితోనే ఉంటాం. మా తొలి చిత్రం పరాజయం అందుకున్నా.. మాకెన్నో పాఠాలు నేర్పింది. మరోసారి ఫెయిల్యూర్‌ ఎదురుపడకూడదని మేం అప్పుడే నిశ్చయించుకున్నాం. ఓ ప్లానింగ్‌ ప్రకారం ముందుకెళ్తున్నాం. వీధి నాటకాలు, హరికథలు సామాజిక, సాంస్కృతిక అవగాహన కల్పించేవి. మన మూలాలను గుర్తుచేసుకుంటూ ఆ నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించాలనుకుంటున్నాము’’ అని అన్నారు.

కేవలం కన్నడలోనే కాదు, తెలుగులోనూ కొన్ని నిర్మాణ సంస్థలు ఇటీవల తెరకెక్కించిన సినిమాలు వాటి బడ్జెట్‌తో పోలిస్తే, నాలుగైదు రెట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో మరింత ముందుకు వెళ్తున్నాయి. ఎప్పుడైతే నిర్మాతకు సినిమా, దాని నిర్మాణవ్యయంపై పట్టు ఉంటుందో ఆ మూవీ సగం విజయం సాధించినట్టే!

Read more RELATED
Recommended to you

Exit mobile version