ఒక సినిమా ఫ్లాప్ అయితే.. కనిపించకపోవడం… వరుసగా డిజాస్టర్స్ అయితే.. కెరీర్ అయిపోయినట్టేనని భావిస్తే.. ఫ్లాప్‌లో కాలేసినట్టే. హీరోయిన్స్ విషయంలో ఫేడౌట్ అనే మాటకు చోటే లేదు. తెలుగు కాకపోతే.. మరో భాషను ఓన్ చేసుకుంటున్నారు. ఒక వేళ అన్ని ఇండస్ట్రీలు బాయ్‌కాట్ చేస్తే.. సైడ్ ఇన్‌కంకు దారులున్నాయి. ఏదో ఒక రూపంలో బిజీనే. ఇలా ఫేడౌట్ అనే మాట నుంచి బైటపడుతున్నారు ఆ ముద్దుగుమ్మలు.
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపించింది. ఇందులో నిజం లేదని తేలినా. ఆ మరక మాత్రం అలా వుండిపోయింది. అయితేనేం బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో పాగా వేసేసింది రకుల్. తెలుగులో చెక్ మూవీలో నితిన్‌తో.. క్రిష్ మూవీలో వైష్ణవ్‌తేజ్‌తో జత కడుతూనే హిందీ బంపర్ ఆపర్స్ అందుకుంది. అజయ్ దేవగణ్ మెగాఫోన్ పట్టిన ఫస్ట్ మూవీ ‘మేడే’లో రకుల్ నటిస్తోంది. అలాగే ‘ఎటాక్’ మూవీలో జాన్ అబ్రహాంతో జత కట్టింది. ‘సిమ్లా మిర్చి’లో హేమమాలిని కూతురుగా.. నటిస్తోంది. రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత హిట్ లేని రకుల్ ఫేడౌట్ అయిపోందనుకున్నారు. కానీ బిజీగా గడిపేస్తోంది ఈ ఫ్లాప్ హీరోయిన్
రాశిఖన్నా తన ఏడేళ్ల కెరీర్‌లో తెలుగులో దాదాపు పాతిక సినిమాలు చేసింది. వీటిలో ఐదు మాత్రమే హిట్ అయ్యాయి. ఊహలు గుసగుసలాడే.. సుప్రీమ్.. జై లవకుశ… తొలిప్రేమ.. ప్రతిరోజు పండుగే… హిట్టయినా.. ఈ అమ్మడి సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఈ అమ్మడిపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడినా..ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. యంగ్ హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయకపోయినా.. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా వుంది రాశి.
తమన్నా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లయింది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోతో జత కట్టకపోయినా.. బిజీనే. సీటీమార్‌లో గోపీచంద్ సరసన కబాడీ కోచ్‌గా నటిస్తోంది. హిందీలో “బోలే చూడియన్’ అనే మూవీ చేస్తోంది. వెండితెరను ఏలేసిన మిల్కీబ్యూటీ.. ఓటీటీని మాయ చేస్తోంది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది తమన్నా. మరోవైపు.. ఆహాలోని ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
చేతిలో తెలుగు సినిమాలుంటేనే ఫామ్‌లో వున్నట్టు.. లేదంటే ఫేడౌట్ అనుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సమంత నటిస్తున్న తెలుగు మూవీ ఒక్కటీ లేకపోయినా.. తమిళంలో రెండు సినిమాలున్నాయి.మరోవైపు.. ‘ది ఫ్యామిలీ మేన్’ అనే వెబ్ సిరీస్‌లో నెగిటివ్ టచ్ వున్న రోల్ పోషిస్తోంది. మరోవైపు సామ్‌జామ్ షో హోస్ట్‌గా సెలబ్రిటీస్‌ను ఇంటర్వ్యూ చేస్తూ గడిపేస్తోంది.
ఓ వెలుగు వెలిగి కనిపించకుండాపోతే ఫేడౌట్ అంటాం. కానీ.. ఈ పదాన్ని హీరోయిన్స్ మీద ప్రయోగించలేం. ప్రస్తుతం వీళ్లకున్న ఆప్షన్స్ ఎవరికీ లేవు. తెలుగు కాకపోతే.. తమిళం.. లేదంటే హిందీ. ఏదో ఒక భాషలో ఏదో ఒక సినిమా చేస్తూనే వుంటారు. ఒక వేళ సినిమాలు లేకపోతే.. వెబ్ సిరీస్‌లు ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు.. గేమ్‌షోస్‌కు.. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గా వుండే అవకాశం బుల్లితెర ఇస్తోంది.