సంక్రాంతి నాడు ఈ దానాలు చేస్తే మోక్షం !

-

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని పురాణ ప్రశస్తి. మకర సంక్రాంతిని సాధారణంగా జనవరి 14న జరుపుతారు. అప్పుడప్పుడు ఆయా తిథులు, రాశుల్లో సూర్యప్రవేశంలో స్వలమార్పులు ఇంగ్లిష్‌ లెక్కల్లో చెప్పాలంటే లీఫ్‌ ఇయర్‌ వచ్చినప్పుడు జనవరి 15న సంక్రాంతి వస్తుంది. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే బ్రాహ్మీమూహుర్తంలో లేవాలి. తర్వాత అభ్యంగన స్నానం, దేవుడి పూజ, ఆడవారు ఇంటిముందు ముగ్గులు, గొబ్బెమ్మలు తదితర కార్యక్రమాలు చేయాలి. పిల్లలు,పెద్దలు పిండివంటలు, పంతంగులు, దానాలు, ధర్మాలు, బంధుమిత్రుల కలయిక తదితర పనులు చేసుకోవాలి.

ఇక సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు, బంధువులు సమావేశమై, రేగిపండ్లు, శనగలు,పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.

పితృదేవతలకు తర్పణాలు !

సంక్రమణం రోజున పెద్దలకు తర్పణాలు వదలడం ఆచారంగా వస్తుంది. ప్రతి సంక్రమణం రోజు పెద్దలకు తర్పణాలు వదులుతారు. అయితే ఈ మకర సంక్రమణం రోజు ఉత్తరాయణం రావడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. పెద్దలకు స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. తల్లి లేదా తండ్రి లేని వారు మాత్రమే ఈ తర్పణాలు వదలాలి.

గంగిరెద్దులు డోలు సన్నాయి !

సంక్రాంతి రోజులలో కన్పించే సుందర దృశ్యం.. గంగిరెద్దులు, వాటిని ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యము ఇస్తారు.
పిల్లల పతంగులు.. సంక్రాంతి వచ్చిందంటే ఉత్తరాది ముఖ్యంగా హైదరాబాద్‌,తెలంగాణ ప్రాంతంలో చిన్న పెద్ద తేడాలేకుండా పతంగులను ఎగరవేస్తారు. పోటాపోటీగా ఈ పతంగులను ఎగిరవేసి ఆనందంగా గడుపుతారు. హైదరాబాద్‌లో కొన్నేండ్లుగా టూరిజం వారు కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల నుంచి కైట్స్‌ను ఎగిరవేసే వారు ఇక్కడ పేరెడ్‌గ్రౌండ్‌లో అంగరంగ వైభవంగా వాటిని ప్రదర్శిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version