ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అగ్ర రాజ్యమైన అమెరికాలో దీని ప్రభావం అధికంగా ఉంది. తాజాగా.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గర్ల్ ఫ్రెండ్ కింబర్లీ గిల్‌ఫోయల్ కి కరోనా సోకింది. దీంతో అధికారుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. గతంలో ఫాక్స్ న్యూస్ టెలివిజన్‌లో పనిచేసిన కింబర్లీ ట్రంప్ జూనియర్‌తో సహజీవనం చేస్తున్నది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగంతో పాటు మౌంట్ రష్మోర్‌లోని బాణాసంచా వేడుకలు పర్యవేక్షించేందుకు కింబర్లీ సౌత్ డకోటా వెళ్లింది. అయితే అధ్యక్షుడితో ఎవరైనా సన్నిహితంగా ఉంటారని భావిస్తే..వారందరికీ సాధారణంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే కింబర్లీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, దీంతో వెంటనే ఆమెను ఐసోలేషన్ లో ఉంచినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.