ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ నిన్న డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించిన విషయం విదితమే. కాగా ఈ సేవకు అక్కడి ప్రజల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తోంది. 40 రకాల ప్రభుత్వ సేవలను ఇంటి వద్దే పొందేలా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఈ సర్వీస్‌ను చాలా మంది ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంటి వద్ద ప్రభుత్వ సేవలు కావాలనుకునే వారు ప్రభుత్వం సూచించిన నంబర్ 1076కు ఫోన్ చేయాలి. అయితే నిన్న ఈ సేవ ప్రారంభమైన ఒక్క రోజే సదరు నంబర్‌కు ఏకంగా 25వేల కాల్స్ వచ్చాయని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర 40 రకాల సేవలను డోర్ స్టెప్ డెలివరీ ద్వారా ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు ఇంటి వద్దే అందిస్తోంది. త్వరలోనే మరో 30 రకాల సేవలను ఇందులో చేరుస్తామని, ఈ ఏడాది చివరి వరకు ఏకంగా 100 రకాల ప్రభుత్వ సేవలను డోర్ స్టెప్ డెలివరీ ద్వారా ప్రజలకు అందిస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
డోర్ స్టెప్ డెలివరీ నిన్న ప్రారంభం కాగా ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 25వేల కాల్స్ వచ్చాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు 1076 నంబర్‌కు ఫోన్ చేసి తమకు కావల్సిన సేవ గురించి చెబితే మొబైల్ సహాయక్‌లు సంబంధిత సేవకు గాను పత్రాల కోసం ప్రజల ఇంటి వద్దకు వస్తారని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం 40 మంది ఆపరేటర్లను ఈ సేవ కోసం వాడుతున్నామని, త్వరలో 80 మంది వరకు ఆపరేటర్లు అందుబాటులోకి వస్తారని ఆయన తెలిపారు.