ఝార్ఖండ్ రాంచీలోని ఖాడ్ గడ్ బస్టాండ్ లో దీపావళి పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ సిబ్బంది బస్సులో దేవుడి చిత్రపటం పూజ చేసి వద్ద దీపాన్ని వెలిగించారు. ఆ తర్వాత బస్సులో నిద్రించారు.
వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడి ఎదుట వెలిగించిన దీపం వల్ల బస్సులో మంటలు చెలరేగాయి. వెంటవెంటన బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్న డ్రైవర్, కండక్టర్ మంటలను గమనించలేదు. ఆ మంటల్లో ఇద్దరు సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సులో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే డ్రైవర్ మదన్, కండక్టర్ ఇబ్రహీం సజీవదహనమయ్యారు. బస్సులో పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున ఒంటిగంటకు జరిగిందని అధికారులు తెలిపారు.