ధరణి పోర్టల్ పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల కొంపలు ముంచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన సిరిసిల్లలో దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తన పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని ఎమోషనల్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ మంత్రిని అడ్డం పెట్టుకుని సిరిసిల్లలో భూములు కబ్జా చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని దివ్యాంగుల కాలనీని నిర్మించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇష్టారీతిన మాట్లాడితే సమాజం ఎవరినీ గుర్తించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా కేంద్రమంత్రి సైటర్లు వేశారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరిట‘ధరణి’ని తీసుకొచ్చి అందరి కొంపలు ముంచారని, వేల ఎకరాలను ఆ పార్టీ నేతలు కొల్లగొట్టారన్నారు. ‘ధరణి’తో రైతులకు ఏమీ ఒరగలేదని, కేసీఆర్ కుటుంబం అన్ని రకాలుగా లాభపడిందని విమర్శించారు.