తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి చిప్ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది. గతంలో విచ్చలవిడిగా నకిలీ కార్డులు రావడంతో వాటిని అడ్డుకునే క్రమంలో రవాణాశాఖ చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. కానీ 40 రోజులుగా చిప్‌ల కొరతతో కార్డుల జారీ నిలిచిపోయింది. ఆరు లక్షల వరకు కార్డుల జారీ పేరుకుపోయింది. విదేశాల నుంచి చిప్‌ల దిగుమతి నిలిచిపోవటంతో తప్పనిస్థితిలో మళ్లీ పాతపద్ధతిలో కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు.
కార్డులు లేకపోవటంతో తనిఖీల్లో పోలీసులు చలానాలు రాస్తుండటం, రాష్ట్ర సరిహద్దుల్లో సమస్యలు ఎదురవుతుండటంతో గందరగోళంగా మారింది. ఈ క్రమంలో నిలిచిపోయిన కార్డులన్నింటినీ చిప్‌లు లేకుండా వెంటనే జారీ చేయాలని నిర్ణయించింది రవాణాశాఖ . చిప్ లేని కార్డుల జారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. మళ్లీ రెండుమూడు నెలల్లో చిప్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్న రవాణాశాఖ.. అప్పటి వరకు చిప్ లేకుండానే కార్డులను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.