డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం ఈ నెల 21తో గడువు ముగుస్తుంది. రేపటి వరకు డబ్బులు చెల్లించేందుకు అవకాశం కల్పించగా, 21తో దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ గడువును 28 వరకు పొడిగించారు. రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.
కాగా.. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి పది రోజుల పాటు సీబీఆర్టీ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఈ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. మరోవైపు బీఈ, బీటెక్‌తో బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా టీచర్ పోస్టులకు అర్హులేనని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పరీక్షలు వాయిదా పడ్డందున.. అప్లికేషన్ల గడువును పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.